ప్రపంచవ్యాప్తంగా ప్రతి బిడ్డకు మెరుగైన భవిష్యత్తును అందించడమే లక్ష్యంగా యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ (యూనిసెఫ్) అవిశ్రాంతంగా పనిచేస్తోంది.
యూనిసెఫ్
ప్రపంచవ్యాప్తంగా ప్రతి బిడ్డకు మెరుగైన భవిష్యత్తును అందించడమే లక్ష్యంగా యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ (యూనిసెఫ్) అవిశ్రాంతంగా పనిచేస్తోంది. దీని లక్ష్యాలు పిల్లల హక్కులను పరిరక్షించడం, వారి ప్రాథమిక అవసరాలను తీర్చడం, వారి పూర్తి సామర్థ్యాన్ని సాధించేలా ప్రోత్సహించడం. ఈ లక్ష్యాలను నెరవేర్చే క్రమంలో, మనం ప్రతి ఒక్కరం భాగస్వాములై, పిల్లల భవితకు బలమైన బాటలు వేయాల్సిన బాధ్యత ఉంది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత, యుద్ధంతో నాశనమైన దేశాలలోని పిల్లలు, తల్లులకు అత్యవసర ఆహారం, ఆరోగ్య సంరక్షణ అందించాలనే తక్షణ అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో, 1946 డిసెంబర్ 11న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ద్వారా యూనిసెఫ్ స్థాపించబడింది. ప్రారంభంలో ఇది ఒక తాత్కాలిక నిధిగా సృష్టించబడినప్పటికీ, 1950ల తర్వాత ఇది తక్కువ అభివృద్ధి చెందిన దేశాలలో పిల్లల సంక్షేమాన్ని మెరుగుపరచడానికి సాధారణ కార్యక్రమాల వైపు తన దృష్టిని మళ్లించింది. 1953లో, ఇది ఐక్యరాజ్యసమితి శాశ్వత సంస్థగా మారింది, 'అత్యవసర' అనే పదం దాని పేరు నుంచి తొలగించారు. అయినప్పటికీ సంక్షిప్త నామం యూనిసెఫ్ అలాగే కొనసాగింది. 1990 నుండి ఐదు సంవత్సరాలలోపు పిల్లల మరణాల రేటును 60 శాతం కంటే ఎక్కువ తగ్గించడంలో ప్రపంచ పురోగతికి యూనిసెఫ్ ‘పిల్లల మనుగడ విప్లవం’ పునాదిగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు అందించడంలో యూనిసెఫ్ కీలక పాత్ర పోషించింది, ఇది అనేక ప్రాణాంతక వ్యాధులను నియంత్రించడానికి సహాయపడింది. 1965లో, దేశాల మధ్య సోదరభావాన్ని పెంపొందించడం, ప్రపంచ శాంతికి ఒక ముఖ్యమైన కారకంగా ఉద్భవించినందుకు యూనిసెఫ్‌కు నోబెల్ శాంతి బహుమతి లభించింది. పిల్లలకు ప్రాథమిక విద్య, పోషకాహారం, పరిశుభ్రమైన నీరు, పారిశుధ్య సేవలను అందించడానికి, ప్రోత్సహించడానికి ఇది నిరంతరం కృషి చేస్తుంది. యూనిసెఫ్ తన పనితీరులో కొన్ని సవాళ్లను, విమర్శలను కూడా ఎదుర్కొంది. వివిధ దేశ ప్రభుత్వాలు, ప్రైవేట్ దాతల విరాళాలపై ఆధారపడటం వల్ల కొన్నిసార్లు నిధుల స్థిరత్వానికి సవాలుగా మారుతోంది. స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలలో లోపాలు, నిరంతర మానవతా సంక్షోభాలు, కొవిడ్ మహమ్మారి ప్రభావాలు, వాతావరణ మార్పుల వంటి బాహ్య సవాళ్లను సంస్థ ఎదుర్కొంది. సంస్థ అంతర్గత ఒత్తిళ్లను కూడా ఎదుర్కొంటోంది. చివరగా.. యూనిసెఫ్ నిర్దేశించిన లక్ష్యాలు కేవలం ఒక అంతర్జాతీయ సంస్థకు మాత్రమే పరిమితం కావు. అవి మన సమాజ ప్రగతికి, మానవత్వపు విలువలకు అద్దం పడతాయి. ప్రతి బిడ్డ చిరునవ్వుతో, ఆరోగ్యంగా, చదువుకుంటూ, సురక్షితంగా పెరిగినప్పుడే నిజమైన దేశాభివృద్ధి సాధ్యమవుతుంది. కాబట్టి, ప్రతి ఒక్కరం మన వంతు బాధ్యతగా యూనిసెఫ్ లక్ష్యాలను ముందుకు తీసుకువెళ్తూ, రేపటి పౌరులైన పిల్లల భవితకు దృఢమైన పునాదులు వేద్దాం.
- అభిషేక్ కురుమ