దేశ అంతర్గత భద్రత అత్యంత క్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. 2025 నవంబర్ 10న ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన భయంకరమైన కారు పేలుడు ఉదంతం దేశ రాజధానినే కాకుండా, మొత్తం దేశ ప్రజల మనసుల్లో తీవ్ర భయాందోళనలను, భద్రతపై అనుమానాలను కలిగించింది.
ప్రతీకాత్మక చిత్రం
దేశ అంతర్గత భద్రత అత్యంత క్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. 2025 నవంబర్ 10న ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన భయంకరమైన కారు పేలుడు ఉదంతం దేశ రాజధానినే కాకుండా, మొత్తం దేశ ప్రజల మనసుల్లో తీవ్ర భయాందోళనలను, భద్రతపై అనుమానాలను కలిగించింది. ఈ ఘటన, మనతోనే కలిసి జీవిస్తూ, మన అభివృద్ధిని, మన శాంతిని కోరుకోని, మన చావును కోరుకునే శక్తులు దేశంలోనే పాతుకుపోతున్నాయా అనే తీవ్రాలోచనకు తావిస్తోంది. ఇది కేవలం బాహ్య సరిహద్దుల నుండి వచ్చే ముప్పు మాత్రమే కాదు, దేశం లోపల నుండే తలెత్తుతున్న ఒక పెను ప్రమాదం. అంతర్గత భద్రత అనేది దేశ సుస్థిరతకు, అభివృద్ధికి అత్యంత కీలకమైన అంశం. ఉగ్రవాదం, వేర్పాటువాదం, అంతర్యుద్ధాలు వంటి అనేక సవాళ్లు దేశ అంతర్గత భద్రతకు ముప్పుగా పరిణమిస్తాయి. ఈ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ప్రభుత్వం, భద్రతా దళాలు, నిఘా సంస్థలు మరియు పౌరులు అందరూ సమన్వయంతో పనిచేయాలి. సరిహద్దుల నుంచి, దేశంలోపల నుండి తలెత్తుతున్న ఉగ్రవాదం దేశ భద్రతకు తీవ్రమైన ముప్పు. ఉగ్రవాద సంస్థలు హింసను ప్రేరేపించి, ప్రజలలో భయాందోళనలు సృష్టించి, దేశ సుస్థిరతను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నాయి. కొన్ని వర్గాలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం దేశాన్ని విభజించడానికి ప్రయత్నిస్తాయి. ఇది దేశ సమగ్రతకు, ఐక్యతకు ముప్పు కలిగిస్తున్నాయి. సామాజిక, ఆర్థిక, రాజకీయ కారణాల వల్ల అంతర్యుద్ధాలు, సామాజిక అశాంతి తలెత్తే ప్రమాదం ఉంది. ఇది దేశంలో అస్థిరతను సృష్టించి, అభివృద్ధిని అడ్డుకుంటుంది. డిజిటల్ యుగంలో సైబర్ నేరాలు, సైబర్ దాడులు పెరిగిపోయాయి. ఇవి దేశ ఆర్థిక వ్యవస్థకు, కీలక మౌలిక సదుపాయాలకు తీవ్రమైన నష్టం కలిగిస్తున్నాయి. మాదకద్రవ్యాల స్మగ్లింగ్, మానవ అక్రమ రవాణా, ఆయుధాల అక్రమ రవాణా వంటి సంఘటిత నేరాలు దేశ భద్రతకు పరోక్షంగా ముప్పు కలిగిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. భద్రతా దళాలకు ఆధునిక శిక్షణ, ఆయుధాలు మరియు సాంకేతిక పరిజ్ఞానం అందించడం ద్వారా వారి సామర్థ్యాన్ని పెంచాలి.ఉగ్రవాద కార్యకలాపాలను ముందే పసిగట్టి, వాటిని నిరోధించడానికి నిఘా వ్యవస్థను మరింత సమర్థవంతంగా చేయాలి. కేంద్ర, రాష్ట్ర భద్రతా సంస్థల మధ్య సమన్వయం మరియు సమాచార మార్పిడిని పెంచాలి.ఉగ్రవాదం, వేర్పాటువాదం, సంఘటిత నేరాలను అరికట్టడానికి కఠినమైన చట్టాలు రూపొందించి, వాటిని సమర్థవంతంగా అమలు చేయాలి. ప్రజలను భద్రతా అంశాల పట్ల చైతన్యపరచాలి. అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించి, అధికారులకు సమాచారం అందించడంలో ప్రజల భాగస్వామ్యం అవసరం. పేదరికం, నిరుద్యోగం, అసమానతలు వంటి సామాజిక, ఆర్థిక సమస్యలను పరిష్కరించడం ద్వారా అసంతృప్తిని తగ్గించి, ఉగ్రవాదం, వేర్పాటువాదం వైపు యువత ఆకర్షించబడకుండా నిరోధించవచ్చు. సైబర్ దాడుల నుండి దేశ కీలక మౌలిక సదుపాయాలను రక్షించడానికి సైబర్ భద్రతను పటిష్టం చేయాలి. అంతర్గత భద్రత అనేది ఒక నిరంతర ప్రక్రియ. దేశ భద్రతను కాపాడటానికి ప్రభుత్వం, భద్రతా సంస్థలు, పౌరులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. సమన్వయంతో పనిచేయాలి. దేశ సమగ్రతను, సుస్థిరతను కాపాడటానికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలి. ఇందుకోసం ప్రతి భారతీయుడు చొరవ తీసుకోవాలి.
- సుధాకర్ సిరోంచ, ప్రభుత్వ టీచర్