ప్రజల మనసు నాకు తెలుసు

రేవంత్ రెడ్డి బుధవారం ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సర్వం సిద్ధం సభలో కీలక వ్యాఖ్యలు చేశారు.

 revanth reddy

 రేవంత్ రెడ్డి

ఇంగ్లిష్ రాకున్నా రాష్ట్రాన్ని నడిపిస్తున్నా

గుంటూరులో చదువుకోలె.. గూడుపుఠానీ తెల్వదు

ఉస్మానియా యూనివర్సిటీ/హైదరాబాద్, డిసెంబర్ 10 (ఈవార్తలు):  రేవంత్ రెడ్డి బుధవారం ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సర్వం సిద్ధం సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. తాను గుంటూరులో చదువు కోలేదని, గూడు పుఠానీ తెలియదని అన్నారు. ఆ మాటకొస్తే అగ్ర దేశాలైన చైనా, జర్మనీ, జపాన్ వాసులకు కూడా ఇంగ్లిషు రాదని చెప్పారు. ఇంగ్లిషు మాట్లాడే అమెరికా కూడా చైనాపై ఆధారపడిందని, ఒక గంటసేపు చైనా సప్లైలు ఆపితే అమెరికా అల్లాడిపోతుందని అన్నారు. చైనాకు అమెరికా చాలా అప్పుపడిందని, కానీ, అక్కడ ఇంగ్లిషు మాట్లాడరని గుర్తు చేశారు. వర్సిటీలో చాలామంది విద్యార్థులు ఇంగ్లిషు రాదని బాధపడుతుంటారని, ఇంగ్లిష్ రాకపోవడం పెద్ద విషయం కాదని చెప్పారు. తాను రెండేళ్లుగా రాష్ట్రాన్ని నడిపిస్తున్నానని, కావాలంటే ఇంగ్లిషులో మాట్లాడేవాళ్లని 10 మందిని పెట్టుకొని మాట్లాడమని చెబుతానని అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీకి రావాలని, ఆర్ట్స్ కాలేజీ ముందు నిలబడి విద్యార్థుల సమస్యలు తెలుసుకోవాలని అనుకున్నానని చెప్పారు. 4 కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేర్చింది ఉస్మానియా యూనివర్సిటీ అని అన్నారు. ప్రత్యేక ఉద్యమ సమయంలో ఓయూ రాష్ట్ర ఆకాంక్షను బలంగా వినిపించిందని గుర్తుచేశారు. యూనివర్సిటీకి వచ్చేందుకు కావాల్సింది ధైర్యం కాదని, వర్సిటీపై అభిమానం అని చెప్పారు. అధికారులు తనకు పేపర్లు ఇచ్చి అదే మాట్లాడాలని చెప్పారని, కానీ, తన మనసులో ఏముంటే అది మాట్లాడతానని, పేపర్ చూసి మాట్లాడనని చెప్పానని తెలిపారు. ఓయూను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చి దిద్దాలన్నదే తన సంకల్పం అని చెప్పారు.

ఓయూకు రూ.1000 కోట్లు

ఓయూ అభివృద్ధి కోసం రూ.1000 కోట్ల మేర నిధులు విడుదల చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఆ వెంటనే ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మొత్తాన్ని విద్యార్థులకే అంకితం చేస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థులు వర్సిటీ అభివృద్ధి కోసం రూ.45 లక్షల చెక్కును అందజేశారు. భవిష్యత్తు ప్రణాళికల గురించి చర్చించడానికే తాను ఇక్కడికి వచ్చానని తెలిపారు. గతంలో కొందరు ముఖ్యమంత్రులను ఓయూ స్టూడెంట్స్ అడ్డుకున్నారని అన్నారు. ఎందుకు ధైర్యం చేసి ఓయూకు వెళ్తున్నావని తనను కొందరు ప్రశ్నించారని అన్నారు. తాను ఆర్ట్స్ కాలేజీ వద్దకు వచ్చింది ధైర్యంతో కాదని, విద్యార్థుల గుండెల్లో తన మీద ఉన్న అభిమానంతో వచ్చానని అన్నారు. దేశంలోని పురాతన విశ్వవిద్యాలయాల్లో ఉస్మానియా ఒకటి అన్నారు. ఈ వర్సిటీకి గొప్ప చరిత్ర ఉందని అభివర్ణించారు.

ప్రొఫెసర్ కాశీం భజన

సర్వం సిద్ధం సభలో ప్రొఫెసర్ కాశీం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. ఈ సభలో సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ నేతలు, విద్యార్థి నాయకులతో పాటు ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ చింతకింది కాశీం కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన కాశీం.. ‘సీఎం రేవంత్ రెడ్డి 25 ఏళ్ల క్రితం గీత‌మ్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ ఇటీవ‌ల మ‌రో అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. విద్య అనే పేరు కలిగిన అమ్మాయిని రేవంత్ రెడ్డి ప్రేమిస్తున్నారు. అందుకే ఆయన ప్రతి ప్రసంగంలో విద్య గురించి మాట్లాడుతున్నారు. విద్యపై ప్రేమ‌ను రేవంత్ రెడ్డి.. తన గొంతులో ప్రాణం ఉన్నంత వ‌ర‌కు కొన‌సాగించాలి’ అని వ్యాఖ్యానించారు. ఆయన మాట్లాడుతుంటే సీఎం రేవంత్ రెడ్డి సైతం ‘భజన’ చేస్తున్నారన్నట్లుగా ముఖంలో భావోద్వేగాలు పలికించారు. కాశీం వ్యాఖ్యలపై కొన్ని వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. చదువును సరస్వతి తల్లిగా కొలుస్తారని.. అలాంటిది విద్యను ఒక అమ్మాయి అనడం.. ఆమెతో సీఎం రేవంత్ రెడ్డి ప్రేమలో పడ్డాడు అనడం ప్రొఫెసర్ కాశీం భావ దారిద్ర్యాని నిదర్శనమని ఘాటుగా విమర్శిస్తున్నారు.


ఎడారి దేశంలో వరదలు
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్