కోహ్లీ.. రిటైర్మెంట్ వెనక్కి తీసుకో!
విరాట్ కోహ్లీ
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌లో కొనసాగాలని మాజీ క్రికెటర్ శ్రీవాత్స్ గోస్వామి సూచించాడు. అవసరమైతే వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించి టెస్ట్ ఫార్మాట్ ఆడాలని రిక్వెస్ట్ చేశాడు. ప్రస్తుతం కోహ్లీని టెస్ట్ క్రికెట్ మిస్సవుతుందని, ముఖ్యంగా టీమిండియాకు అతని అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు. అంతర్జాతీయ టీ20లతో పాటు టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విరాట్ కోహ్లీ.. కేవలం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్నాడు. వన్డే ప్రపంచకప్ 2027 ఆడటమే లక్ష్యంగా పెట్టుకున్న విరాట్ కోహ్లీ.. అందుకోసం తనకిష్టమైన టెస్ట్ ఫార్మాట్‌కు కూడా గుడ్‌బై చెప్పాడు. కోహ్లీ రిటైర్మెంట్ వెనుక చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌తో పాటు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఉన్నాడని ప్రచారం జరిగింది. అయితే కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత టెస్ట్‌ల్లో టీమిండియా ప్రదర్శన మరీ దారుణంగా తయారైంది. ఇంగ్లండ్ పర్యటనలో ఐదు టెస్ట్‌లను డ్రా చేసుకున్న టీమిండియా.. సొంతగడ్డపై వెస్టిండీస్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్‌ను గెలుచుకుంది. కానీ సౌతాఫ్రికాతో రెండు టెస్ట్‌ల సిరీస్‌లో క్లీన్ స్వీప్ దిశగా సాగుతోంది. ముఖ్యంగా కోల్‌కతా వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా 124 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక 30 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. గింగిరాలు తిరిగిన స్పిన్ వికెట్‌పై చేతులెత్తేసింది. గౌహతి వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లోనూ అదే పేలవ ప్రదర్శనను కొనసాగించింది. ఇదే పిచ్‌పై సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 489 పరుగుల భారీ స్కోర్ చేస్తే.. భారత్ మాత్రం 201 పరుగులకే ఆలౌటైంది. రోడ్డులాంటి పిచ్‌పై భారత బ్యాటర్లు బోల్తా పడటంతో అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ తిరిగి టెస్ట్ టీమ్‌లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని శ్రీవాత్స్ గోస్వామి ఎక్స్ వేదికగా పేర్కొన్నాడు. 'విరాట్ కోహ్లీ వన్డేలకు వీడ్కోలు పలికి టెస్ట్ క్రికెట్‌లో కొనసాగాలి. ఇక తన వల్ల కాదు అనే రోజు వరకు టెస్ట్‌లు ఆడాలి. టెస్ట్ క్రికెట్ కోహ్లీని ఎంతో మిస్సవుతుంది. కేవలం ఆటగాడిగానే కాదు.. మైదానంలో అతను తీసుకొచ్చే శక్తి, జట్టుపై అతనికి ఉండే ప్రేమ, ఆట పట్ల అతనికి ఉన్న అభిరుచి, ఎలాంటి పరిస్థితుల్లోనైనా గెలవగలమని అతను ఇచ్చే నమ్మకాన్ని జట్టు కోల్పోతుంది.'అని శ్రీవాత్స్ గోస్వామి తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. శ్రీవాత్స్ గోస్వామి ట్వీట్‌తో ఏకీభవిస్తున్న నెటిజన్లు.. విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ ఆడాలని రిక్వెస్ట్ చేస్తున్నారు.