ప్రపంచం మెచ్చిన బ్రహ్మోస్ క్షిపణులు
భారత ‘బ్రహ్మాస్త’పై పలు దేశాల ఆసక్తి
పాక్‌పై దాడులతో తెలిసిన మన సత్తా
ఫైనల్ స్టేజీలో ఇండోనేషియాతో ఒప్పందం
న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత, భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాకిస్తాన్‌పై భారీ దాడులు చేసింది. ఈ దాడుల్లో భారత ‘బ్రహ్మోస్’ క్షిపణి పాకిస్తాన్ ఎయిర్ బేసుల్ని ధ్వంసం చేసింది. అత్యంత కచ్చితత్వంతో బ్రహ్మోస్ చేసిన దాడులకు పాకిస్థాన్ వద్ద సమాధానమే లేకుండా పోయింది. దీంతో ఒక్కసారిగా బ్రహ్మోస్ సత్తా ప్రపంచానికి తెలిసింది. ప్రపంచంలోని చాలా దేశాలు ఈ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్‌ను కొనుగోలు చేయడానికి ఉవ్విళ్లూరుతున్నాయి. భారత్ ఏకంగా 450 మిలియన్ డాలర్ల ఆర్డర్లను ఖరారు చేయడానికి సిద్ధమైంది. ఇది భారత రక్షణ ఎగుమతుల సామర్థ్యాన్ని పెంచుతుంది. ఇప్పటికే, ఇండోనేషియాతో బ్రహ్మోస్ డీల్ దాదాపుగా ఖరారైంది. రష్యా తుది ఆమోదం కోసం భారత్ వేచిచూస్తోంది. బ్రహ్మోస్ భారత్-రష్యాల ఉమ్మడి ప్రాజెక్ట్. డీఆర్డీవో, రష్యాకు చెందిన ఎన్‌పీవో మాషినోస్ట్రోయెనియా సంయుక్తంగా అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణులలో ఒకటి. అత్యంత ఖచ్చితత్వంతో దాడులు చేయడం దీని ప్రత్యేకత. నింగి, నేల, నీరు నుంచి ఈ క్షిపణిని ప్రయోగించవచ్చు. ఇటీవల, దుబాయ్ ఎయిర్ షోలో బ్రహ్మోస్ క్షిపణి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది