టీ20 వరల్డ్ కప్ అంబాసిడర్‌గా రోహిత్
ప్రతీకాత్మక చిత్రం
టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు అరుదైన గౌరవం దక్కింది. వచ్చే ఏడాది భారత్ వేదికగా జరగనున్న ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీకి హిట్ మ్యాన్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని ఐసీసీ ఛైర్మన్ జై షా ఎక్స్ వేదికగా వెల్లడించారు. 9 టీ20 ప్రపంచకప్‌లు ఆడిన రోహిత్ శర్మ కంటే గొప్ప రాయబారి ఎవరూ లేరని జై షా కొనియాడారు. రోహిత్ శర్మను బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించడం తనకు దక్కిన గొప్ప గౌరవంగా పేర్కొన్నారు. 'భారత్, శ్రీలంక వేదికగా జరగనున్న అప్‌కమింగ్ టీ20 ప్రపంచకప్ టోర్నీకి రోహిత్ శర్మను బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. టీ20 ప్రపంచకప్ 2024 ఛాంపియన్ టీమ్ సారథి కావడంతో పాటు గత 9 టీ20 ప్రపంచకప్‌లు ఆడిన రోహిత్ శర్మ కంటే గొప్ప బ్రాండ్ అంబాసిడర్ మరొకరు లేరు.'అని జై షా ట్వీట్ చేశారు. మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తర్వాత ఐసీసీ టీ20 ప్రపంచకప్ టోర్నీకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికైన భారత ఆటగాడిగా రోహిత్ శర్మ నిలిచాడు. కోహ్లీ, సచిన్‌కు కూడా ఈ గౌరవం దక్కలేదు. సచిన్ టెండూల్కర్ 2011, 2015, 2023 వన్డే ప్రపంచకప్ టోర్నీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేశాడు.