అంబానీని మించేలా రేవంత్
కేటీఆర్
రూ.4 లక్షల కోట్ల భూ స్కాం!
9,292 ఎకరాలపై సర్కారు కుట్ర
రేవంత్‌పై కేటీఆర్ విమర్శలు
హైదరాబాద్, నవంబర్ 25 (ఈవార్తలు): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకే దెబ్బతో అదానీ, అంబానీలను దాటిపోవాలని చూస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. పారిశ్రామిక వాడల భూములను విక్రయించి రూ. 4 లక్షల కోట్లకు పైగా భూకుంభకోణానికి పాల్పడాలని చూస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి తమ మునిమనవలు, వారి మునిమనవలు కూడా కూర్చుని తిన్నా తరగని ఆస్తిని వెనుకేసుకోవాలనే దురుద్దేశంతోనే ఈ భూకుంభకోణానికి తెరలేపారని అన్నారు.తక్కువ ధరకు 9,292 ఎకరాలను ధారాదత్తం చేసే కుట్రలు జరుగుతున్నాయని ఆయన ధ్వజమెత్తారు. ఇదివరకు పరిశ్రమలు, ప్రజల ఉపాధి కోసం ఇచ్చిన భూములలో ప్రైవేటు వ్యక్తులు అపార్టుమెంట్లు కడతామంటే ప్రభుత్వం అనుమతిస్తోందని అన్నారు. గత ఐదారు దశాబ్దాలుగా హైదరాబాద్ నగరంలో 21 పారిశ్రామిక వాడలు ఏర్పడ్డాయని ఆయన గుర్తుచేశారు. ప్రజల భూములను తీసుకుని ప్రభుత్వాలు పరిశ్రమలకు ఇచ్చాయని, నగరం విస్తరించడంతో పరిశ్రమలు నగరం మధ్యలోకి వచ్చాయని తెలిపారు.బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాలుష్యం లేని పరిశ్రమలు లేదా కంపెనీల ఏర్పాటుకు గ్రిడ్ పాలసీని తీసుకువచ్చినట్లు ఆయన చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న భూదందాపై విద్యార్థి నాయకులు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. పారిశ్రామిక వాడల భూములను విక్రయించి రూ.4 లక్షల కోట్లకు పైగా కుంభకోణం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. 9,292 ఎకరాల భూమిని ధారాదత్తం చేసేందుకు రేవంత్ రెడ్డి సోదరులు, అనుయాయులు ఒప్పందాలు చేసుకున్నారని ఆయన మండిపడ్డారు.తెలంగాణ వనరులను కాపాడుకునే బాధ్యత తెలంగాణ ప్రజలదేనని, ముఖ్యంగా విద్యార్థులు ఈ దిశగా దృష్టి సారించాలని అన్నారు. విద్య, ఉపాధి, కాంట్రాక్టులు, రాజకీయాల్లో 42 శాతం కోటా ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, కామారెడ్డి డిక్లరేషన్‌లో బీసీలకు కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చిందని గుర్తు చేశారు. అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇస్తే ముస్లింలందరికి న్యాయం జరుగుతుందా అని ప్రశ్నించారు. తెలంగాణపై బీఆర్ఎస్ పార్టీకి ఉన్న ప్రేమ ఏ పార్టీకి ఉండదని అన్నారు. తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆయన ఉద్ఘాటించారు