మన అమ్మాయిల కూత..
ప్రతీకాత్మక చిత్రం
‘విశ్వ’మంత మోత!
కబడ్డీ ప్రపంచకప్ విజేతగా భారత్
చైనాను మట్టికరిపించిన మహిళల జట్టు
మొన్న అంధుల టీ20 వరల్డ్ కప్..
నిన్న కబడ్డీ ప్రపంచ కప్ కైవసం
ఢాకా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో భారత మహిళల కబడ్డీ జట్టు మరోసారి తన ఆధిపత్యాన్ని చాటింది. ఉత్కంఠభరితంగా సాగిన ఉమెన్స్ కబడ్డీ వరల్డ్ కప్ 2025 ఫైనల్‌లో భారత్ 35-28 తేడాతో చైనీస్ తైపీపై ఘన విజయం సాధించింది. టోర్నమెంట్ మొత్తం అజేయంగా ముందుకు సాగిన టీమిండియా, కీలకమైన క్షణాల్లో ధైర్యంగా నిలిచి ప్రపంచకప్ ట్రోఫీని వరుసగా రెండోసారి కైవసం చేసుకుంది. పోటీ ప్రారంభం నుంచే భారత్ తన దూకుడును చూపించింది. మొదటి అర్ధభాగం ముగిసే సరికి 20-16 ఆధిక్యంలో నిలిచి, ప్రత్యర్థిపై ఒత్తిడిని కొనసాగించింది. చివరి ఐదు నిమిషాలు మిగిలే సమయానికి భారత్ లీడ్‌ను 29-24కు చేర్చింది. తైపీ ఆటగాళ్లు ఎంతగా పోరాడినా, భారత్ ను దాటలేకపోయారు. చివరగా భారత్ 7 పాయింట్ల తేడాతో మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. టోర్నమెంట్‌లో మొత్తం 11 దేశాలు పాల్గొన్నాయి. సెమీఫైనల్‌లో ఇరాన్‌పై 33-21 తేడాతో భారత్ విజయం సాధించగా, మరోవైపు చైనీస్ తైపీ బంగ్లాదేశ్‌ను ఓడించి ఫైనల్‌కు అర్హత సాధించింది. ఈ ఢాకా వరల్డ్ కప్‌తో కలిపి ఇప్పటి వరకు మహిళల కేటగిరీలో నిర్వహించిన రెండు వరల్డ్ కప్‌లను భారత్ గెలుచుకోవడం విశేషం. 2025 సంవత్సరం భారత మహిళా క్రీడాకారిణులకు స్వర్ణయుగంగా మారింది. ఏడాది ప్రారంభం నుంచే టీమిండియా మహిళలు వరుస విజయాలతో ప్రపంచ క్రీడా వేదికపై సత్తా చాటారు. ఈ ఏడాది మొత్తం నాలుగు ప్రధాన ప్రపంచకప్‌లు భారత్ మహిళలే గెలుచుకోవడం భారత క్రీడా చరిత్రలో అరుదైన ఘట్టంగా నిలిచింది. ఈ ఏడాది ఆరంభంలోనే భారత అండర్-19 మహిళల క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికాపై తొమ్మిది వికెట్ల తేడాతో గెలిచి ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ భారత యువత అద్భుత ప్రతిభ చూపించింది. భవిష్యత్ భారత క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్లే శక్తి ఈ జట్టులో ఉందని ఈ విజయమే నిరూపించింది. మహిళల 50 ఓవర్ల వన్డే వరల్డ్ కప్ 2025లో కూడా భారత్ అదరగొట్టింది. హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలోని టీమ్ దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించి మొదటిసారి వన్డే వరల్డ్ కప్‌ను గెలుచుకుంది. షెఫాలీ వర్మ, దీప్తి శర్మ వంటి ఆటగాళ్ల ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టారు. అలాగే, మహిళల అంధుల టీ20 వరల్డ్ కప్లో భారత జట్టు నేపాల్‌ను చిత్తు చేసి టైటిల్‌ను దక్కించుకుంది. ఈ విజయం భారత మహిళల ప్రతిభా పరాకాష్టను మళ్లీ రుజువు చేసింది.
2025లో భారత మహిళలు గెలిచిన టైటిల్స్
- అండర్ 19 ఉమెన్స్ వరల్డ్ కప్
- ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్
- ఉమెన్స్ బ్లైండ్ టీ20 వరల్డ్ కప్
- ఉమెన్స్ కబడ్డీ వరల్డ్ కప్