ఓటమి ముంగిట టీమిండియా
ప్రతీకాత్మక చిత్రం
తొలి ఇన్నింగ్స్‌లో 201 ఆలౌట్
మార్కో జాన్సెస్ 6/48 నిప్పులు
ప్రస్తుతం 314 పరుగుల లీడ్‌లో సౌతాఫ్రికా
భారత్‌తో రెండో టెస్ట్‌లో సౌతాఫ్రికా పట్టు బిగించింది. బ్యాటింగ్‌లో అసాధారణ ప్రదర్శన కనబర్చిన ఈ వరల్డ్ ఛాంపియన్.. బౌలింగ్‌లోనూ అదే జోరు కొనసాగించింది. పేలవ బ్యాటింగ్‌తో ఫాలో ఆన్ కూడా అందుకోని భారత్.. ఘోర పరాజయం దిశగా సాగుతోంది. అద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్‌లో భారత్ ఓటమిని తప్పించుకోలేదు. వ్యూహాత్మకంగా భారత్‌ను ఫాలో ఆన్ ఆడించకుండా 288 పరుగుల భారీ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా మూడో రోజు ఆట ముగిసే సమయానికి 8 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. ఓపెనర్లు ర్యాన్ రికెల్టన్(13 బ్యాటింగ్), ఎయిడెన్ మార్క్‌రమ్(12 బ్యాటింగ్) ఆచితూచి ఆడి మరో వికెట్ పడకుండా మూడో రోజు ఆటను ముగించారు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 201 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్(97 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 58), వాషింగ్టన్ సుందర్(92 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 48) టాప్ స్కోరర్లుగా నిలవగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. కేఎల్ రాహుల్(22), సాయి సుదర్శన్(15), ధ్రువ్ జురెల్(0), రిషభ్ పంత్(7), నితీష్ కుమార్ రెడ్డి(10), రవీంద్ర జడేజా(6) తీవ్రంగా నిరాశపర్చారు. కుల్దీప్ యాదవ్(122 బంతుల్లో 3 ఫోర్లతో 19)తో కలిసి వాషింగ్టన్ సుందర్ 8వ వికెట్‌కు 72 పరుగులు జోడించాడు. భారత ఇన్నింగ్స్‌లో నమోదైన అత్యధిక భాగస్వామ్యం ఇదే కావడం గమనార్హం. సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సెన్(6/48) ఆరు వికెట్లతో భారత్ పతనాన్ని శాసించగా.. సిమన్ హర్మర్(3/64) మూడు వికెట్లు పడగొట్టాడు. కేశవ్ మహరాజ్‌కు ఒక వికెట్ దక్కింది. 9/0 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన భారత్.. వరుసగా వికెట్లు కోల్పోయింది. సౌతాఫ్రికా బౌలర్లు నిప్పులు చెరగడంతో తొలి సెషన్‌లోనే 4 వికెట్లు కోల్పోయింది. రెండో సెషన్‌లోనూ అదే తడబాటు కొనసాగించిన భారత్ 122 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి ఆలౌట్ దిశగా సాగింది. కానీ సుందర్, కుల్దీప్ విరోచిత పోరాటంతో జట్టును ఆదుకున్నారు. రెండో సెషన్‌లో భారత్ మూడు వికెట్లు కోల్పోయింది. ఆఖరి సెషన్‌లో హాఫ్ సెంచరీ ముంగిట సుందర్ ఔటవ్వడంతో భారత్ పతనం మొదలైంది. సిరాజ్ సాయంతో బుమ్రా జట్టు స్కోర్‌ను 200 పరుగుల మార్క్‌ను ధాటించాడు. సౌతాఫ్రికా ఫాలో ఆన్ ఆడించకుండా బ్యాటింగ్‌కు దిగింది. నాలుగో రోజు ఆటలో తొలి సెషన్ మొత్తం బ్యాటింగ్ చేసి భారత్ ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించాలనే లక్ష్యంతో ఆ జట్టు ఉంది. ప్రస్తుతం సౌతాఫ్రికా 314 పరుగుల ఆధిక్యంలో ఉంది. నాలుగో రోజు ఆటలో మరో 100 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసే ఛాన్స్ ఉంది. ఈ మ్యాచ్‌లో ఓటమి తప్పించుకోవాలంటే నాలుగు రోజు మిగిలిన ఆటతో పాటు ఆఖరి రోజు పూర్తిగా బ్యాటింగ్ చేయాల్సిందే.