ఖేల్ ఖతమ్!
ప్రతీకాత్మక చిత్రం
మరో ఓటమి అంచున టీమిండియా
522 పరుగుల వెనుకంజలో మనోళ్లు
డ్రా అయితే ఊరట.. ఓడితే స్వీప్
సౌతాఫ్రికాతో రెండో టెస్ట్‌లో టీమిండియా చేతులెత్తేసింది. 549 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 15.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 27 పరుగులు చేసింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్(13), కేఎల్ రాహుల్(6) దారుణంగా విఫలమయ్యారు. నైట్‌వాచ్‌మన్‌గా కుల్దీప్ యాదవ్(2 బ్యాటింగ్) బ్యాటింగ్‌కు రాగా.. సాయి సుదర్శన్(2 నాటౌట్)మరో వికెట్ పడకుండా ఆటను ముగించాడు. ప్రస్తుతం భారత్ 522 పరుగుల వెనుకంజలో ఉంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఓటమిని తప్పించుకోవాలంటే ఆఖరి రోజైన బుధవారం మొత్తం బ్యాటింగ్ చేయాలి. లేదంటే టీమిండియా ఘోర పరాజయం తప్పదు. సౌతాఫ్రికా విజయానికి 8 వికెట్లు కావాలి. ప్రస్తుతం సౌతాఫ్రికా బౌలర్లు ఉన్న ఫామ్ నేపథ్యంలో భారత ఓటమి పెద్ద కష్టమేం కాదనిపిస్తోంది. ఇప్పటికే పిచ్‌పై పగుళ్లు ఏర్పడి స్పిన్నర్లకు అడ్వాంటేజ్‌గా మారింది. ఆఖరి రోజు పిచ్ స్పిన్నర్లకు మరింత అనుకూలంగా మారనుంది. అంతకుముందు 26/0 ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన సౌతాఫ్రికా 78.3 ఓవర్లలో 260/5 స్కోర్ వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. దాంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 288 పరుగులు కలుపుకొని మొత్తం 548 పరుగుల ఆధిక్యం సాధించింది. సఫారీ బ్యాటర్లలో ట్రిస్టన్ స్టబ్స్(180 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్‌తో 94) తృటిలో సెంచరీ చేజార్చుకోగా.. టోనీ డీ జోర్జీ(68 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 49) హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా ఒక్కడే(4/62) నాలుగు వికెట్లు తీయగా.. వాషింగ్టన్ సుందర్(1/67) ఒక వికెట్ పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 489 పరుగుల భారీ స్కోర్ చేసింది. సెనరన్ ముత్తుసామి(206 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లతో 109) సెంచరీ సాధించగా.. మార్కో జాన్సెన్(91 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సర్లతో 93) తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. అనంతరం భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 201 పరుగులకే ఆలౌటైంది. యశస్వి జైస్వాల్(58), వాషింగ్టన్ సుందర్(48) మినహా మరే బ్యాటర్ రాణించలేదు. మార్కో జాన్సెన్ 6 వికెట్లతో భారత్ పతనాన్ని శాసించాడు. ఇప్పటికే ఈ సిరీస్‌లో సౌతాఫ్రికా 1-0తో ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్ డ్రా అయినా సిరీస్‌ను ఆ జట్టే కైవసం చేసుకుంటుంది.
స్కోర్లు..
సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ 489 ఆలౌట్
భారత్ తొలి ఇన్నింగ్స్ 201 ఆలౌట్
సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్ 260/5 డిక్లేర్డ్
భారత్ రెండో ఇన్నింగ్స్ 27/2