గంభీర్.. ఇండియన్ గ్రెగ్ ఛాపెల్!
గౌతమ్ గంభీర్
కోచ్‌పై నెటిజన్ల ఆగ్రహం
గ్రెగ్ ఛాపెల్.. ఈ పేరు వింటే చాలు భారత క్రికెట్ పాలిట విలన్ అని చెబుతారు చాలామంది. కెప్టెన్ సౌరవ్ గంగూలీతో విభేదాలు.. డ్రెస్సింగ్ రూమ్‌లో గొడవలకు కారణమైన ఛాపెల్ టీమిండియాను నాశనం పట్టించాడు. చూస్తుంటే గౌతం గంభీర్ పేరు కూడా అతడి సరసన చేరేలా ఉంది. స్వదేశంలో భారత జట్టు ఘోరంగా విఫలమవుతుండడమే అందుకు కారణం. కోచ్‌గా అతడి 18 నెలల కాలంలో స్వదేశంలో మన జట్టు ప్రదర్శన అంతకంతకూ దిగజారుతోంది. కోల్‌కతా టెస్టులో 30 పరుగులతో ఓడిన టీమిండియా.. గువాహటిలోనూ అదే ఫలితాన్ని చవిచూసేలా ఉంది. మూడోరోజు భారత ఆటగాళ్లు ఔటైన తీరు చూసిన ఫ్యాన్స్ కోచ్ గంభీర్‌ను ‘ఇండియన్ గ్రెగ్ ఛాపెల్’ అని విమర్శిస్తున్నారు. రాహుల్ ద్రవిడ్ తర్వాత కోచ్‌గా వచ్చిన గంభీర్ పట్టుబట్టి మరీ తన సొంత టీమ్ ఏర్పాటు చేసుకున్నాడు. వస్తూ వస్తూనే సీనియర్లు రోహిత్ శర్మ , విరాట్ కోహ్లీ లను పక్కన పెట్టేసిన అతడు పలు ప్రయోగాలకు తెరతీశాడు. అయినా సరే అతడి నేతృత్వంలో టీమిండియా పెద్దగా అద్భుతాలు చేయలేదు. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో టీమిండియా వైట్‌వాష్‌తో అవమానం మూటగట్టుకున్న గంభీర్.. ఆపై ఆస్ట్రేలియా గడ్డపైనా తన ముద్ర వేయలేకపోయాడు. కంగారూల దెబ్బకు బోర్డర్-గవాస్కర్ సిరీస్ చేజార్చుకుంది భారత్. అంతే.. కోచ్‌గా పనికిరాడంటూ గంభీర్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే.. శుభ్‌మన్ గిల్ కొత్త నాయకుడిగా ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా గొప్పగా ఆడింది. ఓవల్ టెస్టులో సిరాజ్ సంచలన బౌలింగ్‌తో సిరీస్‌ను సమం చేయడంతో గంభీర్ ఊపిరిపీల్చుకున్నాడు. ఆ వెంటనే సొంతగడ్డపై వెస్టిండీస్‌ను వణికించి రెండు టెస్టుల సిరీస్‌ను గిల్ సేన క్లీన్‌స్వీప్ చేసింది. ఈ సిరీస్ విజయంతో మళ్లీ స్వదేశంలో భారత ఆధిపత్యం మొదలైందని అనుకున్నారంతా. కానీ.. కోల్‌కతా టెస్టులో భారత జట్టు అనూహ్యంగా 30 పరుగుల తేడాతో ఓడింది. తొలి రెండు రోజులు దక్షిణాఫ్రికాను హడలెత్తించిన భారత జట్టు మూడోరోజు మ్యాచ్‌ను అప్పగించేసింది. ఈ మ్యాచ్‌కు జట్టు ఎంపిక నుంచి బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులతో విమర్శల పాలయ్యాడు గంభీర్.
ఏహే.. గంభీర్‌ను తీసేయండి!
టీమిండియా హెడ్ కోచ్ బాధ్యతల నుంచి గంభీర్‌ను తప్పించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. సౌతాఫ్రికాతో రెండో టెస్ట్‌లో టీమిండియా దారుణ ప్రదర్శన నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే గంభీర్‌ను తొలగించాలని సోషల్ మీడియా వేదికగా హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. గంభీర్‌ను తీసేస్తే కానీ జట్టు బాగుపడదని సూచిస్తున్నారు. గౌహతి వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో భారత బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ఈ పేలవ ప్రదర్శనకు హెడ్ కోచ్ గౌతమ్ గంభీరే కారణమని మండిపడుతున్నారు. పిచ్చి ప్రయోగాలతో జట్టును నాశనం చేశాడని, ఆటగాళ్లతో మ్యూజికల్ ఛైర్ ఆడుతూ వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అతన్ని కోచింగ్ బాధ్యతల నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్న సర్ఫరాజ్ ఖాన్, కరుణ్ నాయర్, అభిమన్యు ఈశ్వరన్ వంటి ఆటగాళ్లను కాదని సాయి సుదర్శన్, ధ్రువ్ జురెల్ వంటి ఐపీఎల్ స్టార్లను తీసుకున్న గంభీరే ఈ ఘోర వైఫల్యాన్ని బాధ్యుడని మండిపడుతున్నారు. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న వికెట్‌పై ఎక్స్‌ట్రా పేసర్‌ను తీసుకోకుండా.. నితీష్ కుమార్ రెడ్డి వంటి ఫామ్‌లో లేని ఆటగాడిని ఆడించాడం తెలివి తక్కువ నిర్ణయమని అభిప్రాయపడుతున్నారు.