ఎన్నికలకు రెడీ
ప్రతీకాత్మక చిత్రం
ఎన్నికల సంఘానికి ప్రభుత్వం లేఖ
హైదరాబాద్, నవంబర్ 24 (ఈవార్తలు): పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి వివరాలు సమర్పించి, ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. అన్ని జిల్లాల కలెక్టర్లు సమర్పించిన సర్పంచ్, వార్డు సభ్యుల గెజిట్‌లను ప్రభుత్వం ఎస్‌ఈసీకి పంపింది. 50 శాతం లోబడి రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలకు నిర్వహించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. గత రెండు రోజులుగా దీనికి సంబంధించి తీవ్ర కసరత్తు చేసింది. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన అన్ని రిజర్వేషన్లతోపాటు, లాటరీ విధానంలో మహిళా రిజర్వేషన్లను కూడా పూర్తి చేసింది. పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో విచారణ జరగాల్సింది. అయితే, ప్రధాన న్యాయమూర్తి సెలవులో ఉన్నందువల్ల విచారణ జరగలేదు. మంగళవారం విచారణ తర్వాత నోటిఫికేషన్ జారీ చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా సిద్ధంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 12,733 పంచాయతీల్లోని 1,12,288 వార్డుల్లో మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది.
----
‘స్థానిక’ పంచాయితీ వాయిదా
నేడు విచారణ చేపట్టనున్న హైకోర్టు
హైదరాబాద్, నవంబర్ 24 (ఈవార్తలు): స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సెలవులో ఉండటంతో సోమవారం జరగాల్సిన విచారణ వాయిదా పడింది. ఈ అంశం మంగళవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నగారా మోగించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతున్నది. ఈ నెల 25 లేదా 26వ తేదీన ఎన్నికల షెడ్యూల్ విడుదలకు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తున్నది. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ముందస్తుగా చేపట్టాల్సిన చర్యలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని గురువారం ఉన్నతస్థాయి సమీక్ష కూడా నిర్వహించారు. గత షెడ్యూల్‌లో ప్రకటించినట్టుగా మూడు దఫాల్లో ఎన్నికలను నిర్వహిస్తారని తెలిసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబర్ 20-25 తేదీల్లో ఎన్నికల ప్రక్రియను ముగించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.