50 ఏళ్లైనా బీజేపీకి అధికారం రాదు

50 ఏళ్లైనా బీజేపీకి అధికారం రాదు

rajasingh

రాజాసింగ్

ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్, నవంబర్ 15 (ఈవార్తలు): తెలంగాణలో బీజేపీ మరో 50 ఏళ్ల దాకా అధికారంలోకి రాదు అని  గోషామ‌హ‌ల్ ఎమ్మెల్యే రాజాసింగ్ భార‌తీయ జ‌న‌తా పార్టీపై మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫ‌లితంపై రాజాసింగ్ ఓ వీడియో విడుద‌ల చేశారు. ‘బీజేపీ నేత‌లు మొండిత‌నంతో ముందుకు పోతున్నారు. ఎవ‌రి మాట విన‌డం లేదు. బీజేపీ నాయకులు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ఇంకో 50 ఏళ్ల తర్వాత కూడా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేలా కనిపించడంలేదు. ఏ విధంగా గెల‌వాలి? ఓట‌రును ఏ విధంగా మ‌న వైపు మ‌ళ్లించుకోవాల‌నే విష‌యాల‌ను నేర్చుకోండి. ఏదైనా విష‌యం చెప్తే ఆలోచించండి. తెలంగాణలో బీజేపీ చనిపోతుంది. కిషన్ రెడ్డి గారూ.. దయచేసి కాపాడండి. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం. అలాంటి చోట కాంగ్రెస్ పార్టీ పక్కా ప్లాన్ తో పనిచేసి గెలిచింది. గెలవాలనే కసితో కాంగ్రెస్ పనిచేసింది. కానీ, మన బీజేపీ నేతలు మాత్రం ఎన్ని ఓట్లతో ఓడిపోవాలని టార్గెట్ పెట్టుకుని పనిచేశారు’ అని వ్యాఖ్యానించారు. జూబ్లీహిల్స్ లో ఓటమి ఖాయమని తనకు ముందే తెలుసని, ఈ విషయాన్ని కిషన్ రెడ్డికి కూడా ముందే చెప్పానని గుర్తుచేశారు. జూబ్లీహిల్స్ ఓటమికి ఎవరు బాధ్యత తీసుకుంటారని రాజాసింగ్ ప్రశ్నించారు. ‘రాబోయే జీహెచ్ఎంసీ, లోకల్ బాడీ ఎన్నికల పరిస్థితి ఏంటి? అక్కడ కూడా ఇలాంటి ఫలితాలే వస్తే పార్టీ కార్యకర్తలు, నేతలు ఎక్కడికి పోవాలి?’ అని ప్రశ్నించారు. తాను కిషన్ రెడ్డిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం లేదని, సొంత పార్టీ నాశనం అవుతుందన్న బాధతోనే ఈ మాటలు అంటున్నానని స్పష్టం చేశారు. ‘నేను పార్టీలోకి తిరిగి రాను. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానో లేదో కూడా తెలియదు. కానీ, ఇది నా పార్టీ. కళ్ల ముందే పార్టీని ముంచేస్తుంటే చూస్తూ ఊరుకోలేను. ఇప్పటికైనా పెద్దలు తమ పంతాలు వీడి పార్టీని కాపాడాలి’ అని ఆయన కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్ కు విజ్ఞప్తి చేశారు. అలాగే, జూబ్లీహిల్స్ లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌కు రాజాసింగ్ శుభాకాంక్షలు తెలిపారు.


ఐబొమ్మ నిర్వాహకుడి అరెస్టు
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్