కృష్ణార్జునుల్లా బిల్డప్‌

కృష్ణార్జునుల్లా బిల్డప్‌

kavitha
కవిత

ఒకరిపై ఒకరు బాణాలు వేసుకుంటారు

వారిద్దరు క్షేత్రస్థాయిలో పెద్దగా చేసిందేమీలేదు

జూబ్లీహిల్స్‌ కుట్రలు టైం వచ్చినప్పుడు బయటపెడతా

మోసం చేసి తప్పించుకోవడం హరీశ్‌ నైజం

రామన్నా.. సోషల్‌ మీడియా మత్తు వదులు

మరోసారి కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్‌, నవంబర్‌ 15 (ఈవార్తలు): తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్‌ నేతలు కేటీఆర్‌, హరీశ్‌రావు కృష్ణార్జునులు అని చెప్పుకుంటూ ఒకరిపై ఒకరు బాణాలు వేసుకుంటున్నారని విమర్శించారు. కవిత శనివారం మీడియాతో మాట్లాడుతూ.. తాను 20 ఏళ్లు బీఆర్‌ఎస్‌ పార్టీ కోసం పనిచేశానని తెలిపారు. పార్టీ పెట్టిన, సంస్థను నడిపిన ప్రజల పక్షాన నిలబడటం ముఖ్యమని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా కాంగ్రెస్‌పై వ్యతిరేకత కనిపిస్తుందని... అయినప్పటికీ జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ భారీ మెజారిటీతో ఎలా గెలిచిందని ప్రశ్నించారు. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ అనుకున్న స్థాయిలో పనిచేయడం లేదని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ నాయకులు సోషల్‌ మీడియాలో ఉద్యమాలు చేస్తున్నారని... క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వచ్చి ఎలాంటి ఉద్యమాలు చేయడం లేదని విమర్శించారు. పేరుకు కృష్ణార్జునులు(బీఆర్‌ఎస్‌ నేతలు కేటీఆర్‌, హరీశ్‌రావు) అని చెప్పుకోవడం తప్పితే పెద్దగా క్షేత్రస్థాయిలో పనిచేసిందేమి లేదని సెటైర్లు వేశారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కుట్రలు కూడా జరిగాయని, వాటి గురించి సమయం వచ్చినప్పుడు బయటపెడతామని కవిత చెప్పారు. ప్రతిపక్షాలు ప్రజలు ఆశించిన మేరకు పనిచేస్తే... జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ఫలితం వేరే రకంగా ఉండేదని అన్నారు. అలాంటి పరిస్థితులో ప్రజల తరఫున నిలబడేందుకు తెలంగాణ జాగృతి జనం బాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. ‘‘జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికతో నాకు సంబంధం లేదని చెప్పాను. అయినప్పటికీ 15 మంది స్వతంత్ర అభ్యర్థులు నా దగ్గరకు వచ్చి మేము విత్‌ డ్రా చేసుకుంటాం.. ఎవరికి సపోర్టు చేయమంటారని అడిగారు. అప్పుడు నాకు సంబంధం లేదని, మీరు ఎవరి దగ్గరికైనా వెళ్లండి అని చెప్పాను. అప్పుడు వాళ్లు హరీశ్‌ అన్న దగ్గరకు వెళ్లారు. అయితే ఆయన కూడా వాళ్ల ఇష్టమొచ్చిన వాళ్లకు సపోర్టు చేసుకోమని చెప్పారు. ఈ విషయం అదే స్వతంత్ర అభ్యర్థులు నాకు చెప్పారు. నేను బీఆర్‌ఎస్‌లో లేను కాబట్టి ఎవరికైనా సపోర్టు చేసుకోమని చెప్పాను. కానీ హరీశ్‌ రావు కూడా అదే మాట చెప్పారు. అంటే బీఆర్‌ఎస్‌ను మోసం చేసినట్టే కదా? అంతేకాకుండా ఎన్నికలకు ముందే.. ఫలానా వ్యక్తిని అభ్యర్థిగా పెడితే మీకు సపోర్టు చేస్తానని కాంగ్రెస్‌ పైవాళ్లతో హరీశ్‌ రావు చెప్పాడట. అయితే వాళ్లు ఆ క్యాండిడేట్‌ వద్దని అన్నారట. దీంతో హరీశ్‌ రావు సైలెంట్‌ అయ్యారు. హరీశ్‌ రావు ఏ పనిచేసినా అది ఇతరులు తెలుసుకోవడానికి టైమ్‌ పడుతుంది. దురదృష్టవశాత్తూ, ఇటీవల హరీశ్‌ రావు తండ్రి మరణించారు. ఆ సమయంలో హరీశ్‌ రావు ఇంట్లో ఉండే. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ప్రచారానికి సంబంధించిన టెలికాన్ఫరెన్స్‌లలో పాల్గొన్నారు. అప్పుడు హరీశ్‌ రావు ఇంత కష్టంలో ఉండి కూడా పార్టీ కోసం కష్టపడుతున్నారని ఆయన భజనపరులు పోస్టులు చేశారు. మళ్లీ నిన్నటి నుంచి హరీశ్‌ అన్న లేకపోయేసరికి జూబ్లీహిల్స్‌ ఓడిపోయామని పోస్టులు పెడుతున్నారు. అప్పటివరకు మోసం చేసి వెంటనే తప్పించుకోవడం హరీశ్‌ రావు నైజం. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడనే సంగతి తెలిసిందే. ఇది నాకు తెలిసి గట్టిగా మాట్లాడుతున్నందుకు పార్టీ నుంచి బయటకు పంపేశారు. రామన్న (కేటీఆర్‌) కూడా ఒక్క మీటింగ్‌ అయిపోయిన వెంటనే సార్‌(కేసీఆర్‌)ను ఆయన మోసినట్టుగా, హరీశ్‌ రావు మోసినట్టుగా ప్రచారం చేసుకున్నారు. మేము సార్‌ ముందట బచ్చాగాళ్లం. బచ్చాగాళ్లం బచ్చాగాళ్ల లేక్కన ఉంటే మంచింది. నన్ను బయటకు పంపడంతో నేను నెత్తిమీద తెలంగాణ సమస్యలు ఎత్తుకుని తిరుగుతున్నాను. అందుకే బలంగా మాట్లాడుతున్నాను. పద్మ దేవేందర్‌ రెడ్డి 2009లో ఎక్కడున్నారు? పార్టీ టికెట్‌ ఇవ్వకపోతే కేసీఆర్‌ మీద దుమ్మెత్తిపోసి వెళ్లిపోయారు. మళ్లీ కేసీఆర్‌ దీక్ష చేసి, ఉద్యమం ఉధృతంగా మారడంతో తిరిగి వాపస్‌ వచ్చింది. దేవేందర్‌ రెడ్డికి హరీశ్‌ రావు సపోర్టు. మోసపూరితమైన పోరాటం చేయడం మానుకోవాలి. కేటీఆర్‌ సోషల్‌ మీడియా, ట్విట్టర్‌ విడిచిపెట్టి గ్రౌండ్‌లోకి రావాలి. హరీశ్‌ రావు మోసం చేయడం మానేసి, కృష్ణుడి పాత్రనో, అర్జునుడి పాత్రనో నిర్ణయించుకుని నేరుగా ఫైట్‌ చేయాలి. కేటీఆర్‌, హరీశ్‌ రావులు పేరు కృష్ణార్జునలు అని చెప్పుకుని, ఒకరి మీద ఒకరు బాణాలు వేసుకుంటే ఎలా? ఇందుకు బీఆర్‌ఎస్‌ శ్రేణులు బలి అవుతున్నారు. వీళ్లు ఒకరిపై ఒకరు బాణాలు వేసుకుని పక్క పార్టీ మీద బాణాలు వేయరు. బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు చాలా మంది నాతో కలిసి నడుస్తామని అంటున్నారు. జగదీష్‌ రెడ్డి, మదన్‌ రెడ్డి, ప్రశాంత్‌ రెడ్డి, నిరంజన్‌ రెడ్డి ఎవరు? వాళ్లకు గతంలో ఏముంది? ఇప్పుడు వాళ్లు ఎలా ఉన్నారు? పార్టీ కార్యకర్తల పరిస్థితి ఎలా ఉంది? నా విషయానికి వస్తే 2014 కి ముందు, ఇప్పుడు నా ఆస్తులను మీరు తనిఖీ చేసుకోవచ్చు. ఈడీ, సీబీఐ తనిఖీలు చేశాయి. నా దగ్గర ఏమైనా అదనంగా ఆస్తులు గుర్తించాయా?’ అని కవిత ప్రశ్నించారు.


ఐబొమ్మ నిర్వాహకుడి అరెస్టు
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్