ఐబొమ్మ నిర్వాహకుడి అరెస్టు

ఐబొమ్మ నిర్వాహకుడి అరెస్టు

ibomma ravi
ఐ - బొమ్మ రవి

14 రోజుల రిమాండ్

చంచల్‌గూడ జైలుకు తరలింపు

హైదరాబాద్, నవంబర్ 15 (ఈవార్తలు): పైరసీ సినిమాల వెబ్‌సైట్.. ‘ఐబొమ్మ’ ప్రధాన నిర్వాహకుడు ఇమ్మడి రవిని తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చిన అతడిని సైబర్ క్రైమ్ పోలీసులు కూకట్‌పల్లిలో అదుపులోకి తీసుకున్నారు. రవి కరేబియన్ దీవుల్లో ఉంటూ ఐబొమ్మ వెబ్‌సైట్‌ను నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అరెస్ట్ అనంతరం ఆయన అకౌంట్లో ఉన్న రూ.3 కోట్లు ఫ్రీజ్ చేసినట్లు తెలిపారు. తెలుగు సినిమాలను పైరసీ చేయడంపై గతంలో ఐ-బొమ్మపై తెలుగు ఫిల్మ్‌ యాంటీ పైరసీ టీమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గతంలో ఈ వెబ్‌సైట్‌ కోసం పనిచేస్తున్న ఏజెంట్లను బీహార్, ఉత్తరప్రదేశ్‌లో అదుపులోకి తీసుకోగా.. తాజాగా రవిని అరెస్టుచేశారు. అతడిని నాంపల్లి కోర్టుకు తరలించి జడ్జి ఎదుట ప్రవేశపెట్టారు. విచారించిన జడ్జి ఐబొమ్మ నిర్వాహకుడికి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు అతడిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. 2019 నుంచి ‘ఐబొమ్మ’ వెబ్‌సైట్‌లో పైరసీ సినిమాలను అప్లోడ్ చేస్తూ భారీ నెట్‌వర్క్‌ను నడిపినందుకు రవి ప్రధాన నిందితుడిగా గుర్తించారు. థియేటర్‌లలో కొత్తగా విడుదలైన సినిమాలను గంటల వ్యవధిలోనే వెబ్‌సైట్‌లో అప్లోడ్ చేసే పెద్ద సర్కిల్‌ను అతడు నడిపేవాడని పోలీసులు వెల్లడించారు. ఆరేళ్లలో వేలాది సినిమాలను పైరసీ చేసి అప్లోడ్ చేయడంతో టాలీవుడ్‌కు దాదాపు రూ.3 వేల కోట్లు నష్టం జరిగినట్లు అంచనా వేశారు.  ఇమ్మడి రవి స్వస్థలం విశాఖపట్నంగా పోలీసుల విచారణలో వెల్లడైంది.


కష్టాల్లో భామలు.. ముగ్గురూ ముగ్గురే!
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్