2027 వేసవిలో వారణాసి రిలీజ్: కీరవాణి
ప్రతీకాత్మక చిత్రం
మహేష్ బాబు -రాజమౌళి కాంబినేషన్ మూవీ వారణాసి గ్రాండ్ టైటిల్ ఈవెంట్ హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో వైభవంగా జరిగింది. అయతే ఈ ఈవెంట్ ప్రారంభం కావడానికి ముందే టైటిల్ లీక్ అయింది. ఈ వేదికపై రాజమౌళి మాట్లాడుతూ.. ఒకరోజు ముందు టెస్ట్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఒక డ్రోన్ వచ్చి ప్రతిదీ షూట్ చేసి వెళ్లిందని, కోట్లాది రూపాయలు వెచ్చించి శ్రమిస్తే తమ శ్రమంతా బూడిదలో పోసినట్టయిందని ఆవేదన చెందారు. ఇక ఈ వేదికపై అద్భుత ప్రసంగంతో ఆకట్టుకున్న ఎం.ఎం.కీరవాణి, వారణాసి రిలీజ్ సమయాన్ని వెల్లడించారు. సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి మాట్లాడుతూ-`వారణాసి 2027 వేసవిలో విడుదలవుతుంద`ని వెల్లడించారు. ఈ వేసవి నుండి మహేష్ బాబు అభిమానుల హృదయాల్లో తాను శాశ్వత స్థానాన్ని సంపాదిస్తానని ఆయన అన్నారు. మెలోడీలే కాదు ఇకపై అన్ని రకాల బాణీలతోను అదరగొడతానని ఈ సినిమా నిరూపిస్తుందని కీరవాణి ఛాలెంజ్ చేసారు. బీట్ విషయంలో తనపై వచ్చిన అపప్రద తొలగిపోతుందని కీరవాణి అన్నారు. ఇక రాజమౌళి-మహేష్‌తో 15 ఏళ్ల క్రితమే సినిమా కోసం ప్రయత్నించానని దుర్గా ఆర్ట్స్ అధినేత, సీనియర్ నిర్మాత కెఎల్ నారాయణ వేదికపై వెల్లడించారు. అది ఇప్పటికి కుదిరిందని అన్నారు. భారీ యాక్షన్ అడ్వెంచర్ కోసం చిత్రబృందం రేయింబవళ్లు శ్రమించారని రాజమౌళి తెలిపారు.ఇక ఈ వేదికపై పృథ్వీరాజ్ పాత్రను వివరించడానికి, కీరవాణి బృందం వేదికపై ప్రత్యక్షంగా ఒక పాటను ప్రదర్శించారు. ఇది అభిమానులను ఎగ్జయిట్ చేసింది. ఇక రామోజీ ఫిలింసిటీలో వారణాసి సెట్ ని నిర్మించేందుకు అత్యంత భారీగా ఖర్చయిందని కూడా టాక్ వినిపిస్తోంది.