LAW TIP | హిట్ అండ్ రన్.. శిక్షలు

LAW TIP | హిట్ అండ్ రన్.. శిక్షలు

Hit and run accident punishments

ప్రతీకాత్మక చిత్రం

దేశవ్యాప్తంగా తరచుగా చర్చనీయాంశమవుతున్న ‘హిట్ అండ్ రన్’ కేసుల్లో భారతీయ చట్టం కఠినంగా వ్యవహరిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన కొత్త క్రిమినల్ చట్టాల నేపథ్యంలో, పాత చట్టంతో పోలిస్తే శిక్షలు గణనీయంగా పెరిగాయి. ఒక వాహన డ్రైవర్ ప్రమాదం జరిగిన తరువాత గాయపడిన వ్యక్తికి సహాయం అందించకుండా లేదా పోలీసులకు సమాచారం ఇవ్వకుండా సంఘటనా స్థలం నుంచి పారిపోతే, దానిని 'హిట్ అండ్ రన్' కేసుగా పరిగణిస్తారు. ఇంతకుముందు అమల్లో ఉన్న ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) స్థానంలో వచ్చిన ‘భారతీయ న్యాయ సంహిత’ ప్రకారం, హిట్ అండ్ రన్ కేసుల్లో శిక్షలు భారీగా పెరిగాయి. పాత ఐపీసీ సెక్షన్ 304ఏ కింద నిర్లక్ష్యం వల్ల మరణం సంభవిస్తే గరిష్టంగా రెండేళ్ల జైలు శిక్ష మాత్రమే ఉండేది. కొత్త చట్టం ఈ శిక్షను గణనీయంగా పెంచింది.

శిక్షలు ఇలా..

సెక్షన్ 106(2) - నిర్లక్ష్యంగా వాహనం నడిపి మరణానికి కారణమై, పోలీసులకు/మేజిస్ట్రేట్‌కు సమాచారం ఇవ్వకుండా పారిపోతే 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. అంతేకాదు రూ.7 లక్షల వరకు జరిమానా కూడా విధిస్తారు.

సెక్షన్ 106(1)- నిర్లక్ష్యంగా వాహనం నడిపి మరణానికి కారణమై, డ్రైవర్ స్వచ్ఛందంగా పోలీసులకు/మేజిస్ట్రేట్‌కు సమాచారం ఇస్తే 5 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా ఉంటుంది. 

బాధితులకు పరిహారం

మోటారు వాహనాల చట్టంలోని ప్రత్యేక నిబంధనల ప్రకారం, హిట్ అండ్ రన్ కేసుల్లో బాధితులకు కేంద్ర ప్రభుత్వం పరిహారం అందిస్తుంది.

మరణం సంభవిస్తే: బాధిత కుటుంబానికి రూ. 2 లక్షల పరిహారం.

తీవ్ర గాయాలైతే: బాధిత వ్యక్తికి రూ.50,000 పరిహారం. ఈ పరిహారం కోసం బాధితులు లేదా వారి కుటుంబ సభ్యులు, ప్రమాదం జరిగిన వివరాలతో కూడిన ఫారం (ఫారం-1) ద్వారా పోలీసులకు లేదా జిల్లా అధికారులకు దరఖాస్తు చేసుకోవాలి.


నేటి బాలలే రేపటి సమాజ సేవకులు
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్