ఒమన్ పర్యటనలో ప్రధాని మోదీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన మూడు దేశాల పర్యటనలో చివరి అంకానికి చేరుకున్నారు. పర్యటనలో భాగంగా బుధవారం ఆయన ఒమన్ రాజధాని మస్కట్‌లో అడుగుపెట్టారు.

narendhra modi

 నరేంద్ర మోదీ

సైనిక వందనంతో ప్రధానికి స్వాగతం

వాణిజ్యం, రక్షణ, ఇంధన రంగాలపై చర్చలు

మస్కట్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన మూడు దేశాల పర్యటనలో చివరి అంకానికి చేరుకున్నారు. పర్యటనలో భాగంగా బుధవారం ఆయన ఒమన్ రాజధాని మస్కట్‌లో అడుగుపెట్టారు. మస్కట్ విమానాశ్రయంలో ఒమన్ ఉప ప్రధాని (రక్షణ వ్యవహారాలు) సయ్యద్ షిహాబ్ బిన్ తారిఖ్ అల్ సయీద్ ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని మోదీకి సైనిక వందనంతో గౌరవ స్వాగతం లభించింది. భారత్, ఒమన్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసే లక్ష్యంతో ఈ పర్యటన సాగుతోంది. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది. పర్యటనలో భాగంగా ఒమన్ సుల్తాన్ హైతామ్ బిన్ తారిఖ్‌తో ప్రధాని మోదీ విస్తృత స్థాయి చర్చలు జరపనున్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన సహకారం, రక్షణ, భద్రత, సాంకేతికత వంటి కీలక అంశాలపై ఇరువురు నేతలు సమీక్షించనున్నారు. 2018 తర్వాత ప్రధాని మోదీ ఒమన్‌లో పర్యటించడం ఇది రెండోసారి. గతేడాది డిసెంబర్‌లో ఒమన్ సుల్తాన్ భారత్‌లో పర్యటించారు. శతాబ్దాల నాటి సముద్ర వాణిజ్యం, ప్రజల మధ్య సంబంధాలతో ఇరు దేశాల బంధం బలపడిందని విదేశాంగ శాఖ కార్యదర్శి అరుణ్ కుమార్ ఛటర్జీ తెలిపారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీ ఇరు దేశాల వ్యాపార ప్రముఖులతో సమావేశమవుతారు. అలాగే, ఒమన్‌లో స్థిరపడిన భారత ప్రవాస సంఘంతో కూడా భేటీ కానున్నారు. ఒమన్ పర్యటనకు ముందు ప్రధాని మోదీ ఇథియోపియాలో రెండు రోజుల పాటు పర్యటించారు. ఇథియోపియా ప్రధాని అబే అహ్మద్ అలీ.. స్వయంగా కారు నడుపుతూ మోదీని విమానాశ్రయానికి తీసుకెళ్లి వీడ్కోలు పలకడం విశేషం. ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం 'గ్రేట్ ఆనర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా'ను కూడా మోదీ అందుకున్నారు.


జయహో భారత్!
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్