వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్-గ్రామీణ్ (వీ బీ జీ రామ్ జీ) బిల్లుకు లోక్‌సభలో ఆమోదముద్ర పడింది. భారత్‌లో 2005లో అప్పటి యూపీఏ ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
ప్రతీకాత్మక చిత్రం
బిల్లుకు లోక్‌సభ ఆమోదముద్ర
వీబీ జీ రామ్ జీ పథకం
న్యూఢిల్లీ: వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్-గ్రామీణ్ (వీ బీ జీ రామ్ జీ) బిల్లుకు లోక్‌సభలో ఆమోదముద్ర పడింది. భారత్‌లో 2005లో అప్పటి యూపీఏ ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దాన్ని రద్దు చేసి వీ బీ జీ రామ్ జీని ఎన్డీఏ సర్కారు అమలు చేయనుంది. ఎంజీఎన్ఆర్‌ఈజీఏను గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ కోసం తీసుకొచ్చారు. ఇదే లక్ష్యంతో వీ బీ జీ రామ్ జీని తీసుకొస్తున్నారు. ఈ కొత్త పథకానికి సంబంధించిన బిల్లును గురువారం లోక్‌సభలో ఆమోదించే వేళ విపక్ష సభ్యులు గందరగోళం సృష్టించారు. నిరసనల మధ్యే ఈ బిల్లుకు ఆమోదముద్ర పడింది. లోక్‌సభలో తరుచూ గందరగోళం నెలకొంటుండడంతో సభను శుక్రవారానికి వాయిదా వేశారు. బిల్లుపై కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ.. ఈ చట్టం గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఉపాధిని కల్పిస్తుందని, గ్రామాలు స్వయం సమృద్ధి సాధించాలన్న మహాత్మా గాంధీ కలను సాకారం చేస్తుందని అన్నారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ) బిల్లు గ్రామాల సమగ్ర అభివృద్ధిని సాధిస్తుందని, పేదరిక రహిత గ్రామాలుగా మార్చుతుందని, వేగంగా అభివృద్ధి సాధించేలా చేస్తుందని చెప్పారు. ఉపాధి హామీ పథకంలో ఇప్పటి వరకు 100 రోజుల పని దినాలు ఉండగా.. వికసిత్ భారత్ రోజ్‌గార్, అజీవికా హామీ మిషన్ (గ్రామీణ్) పథకంగా చేసిన మార్పులో భాగంగా ఆ పనిదినాలను 125 రోజులకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే కూలీలకు ఇచ్చే కనీస వేతనాన్ని రూ.240కి పెంచారు. ఈ పథకం కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 1.51 లక్షల కోట్లు కేటాయించింది. అయితే, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి పేరు మార్చడంపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు చేశాయి. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి పథకానికి పేరు మార్చి, లిఖిత పూర్వకంగానే కాకుండా ఆచరణలోనూ రామ రాజ్య భావనను నాశనం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. మహాత్మా గాంధీ పేరును తొలగించడం ద్వారా గాంధీతో పాటు రవీంద్రనాథ్ ఠాగూర్ గౌరవాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం తుంగలో తొక్కిందని మొయిత్రా విమర్శించారు. ఈ బిల్లు ‘నా కిసీ కా సాథ్, నా కిసీ కా వికాస్, నా రహీమ్ కా, నా రామ్ కా’ అనే భావనను ప్రతిబింబిస్తోందని ఆమె ఎద్దేవా చేశారు. 2005 నాటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం గ్రామీణ భారతంలో జీవన భద్రత భావనకు విప్లవాత్మక మార్పు తెచ్చిందని పేర్కొన్నారు.