కాంగ్రెస్‌కు ఓటేసి నన్నడిగితే ఎట్ల?
కేటీఆర్
నెటిజన్‌కు కేటీఆర్ కౌంటర్
హైదరాబాద్, నవంబర్ 25 (ఈవార్తలు): ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపుపై ఓ నెటిజన్ చేసిన పోస్టుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికరంగా స్పందించారు. "అభివృద్ధి కోసం కాంగ్రెస్‌కు ఓటు వేశాను, కానీ మీరు ఈ సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించాలి" అని కోరిన నెటిజన్‌కు.. "మీరు ఓటు వేసింది కాంగ్రెస్ పార్టీకి అయినప్పుడు, ఈ ప్రశ్నకు సమాధానం కూడా వాళ్లనే అడగాలి కదా?" అంటూ కేటీఆర్ బదులిచ్చారు. పటాన్‌చెరు నుంచి డీఎల్ఎఫ్ వరకు నడిచే మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సు ఛార్జీని రూ. 30 నుంచి రూ. 45కు పెంచారని, ఇది తమ లాంటి రోజువారీ ప్రయాణికులకు భారంగా మారిందని ఓ నెటిజన్ ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించి, ప్రభుత్వ తీరును నిలదీయాలని కేటీఆర్‌ను ట్యాగ్ చేస్తూ కోరాడు. తాను అభివృద్ధి కోసమే కాంగ్రెస్‌కు ఓటు వేశానని, కానీ ఇంత భారీగా ఛార్జీలు పెంచడం సరికాదని ఆ పోస్టులో పేర్కొన్నాడు. ఈ పోస్టుపై స్పందించిన కేటీఆర్, "మీరు చెప్పినట్టు నిజంగా కాంగ్రెస్‌కే ఓటేసి ఉంటే, ఈ ప్రశ్నకు సమాధానం కూడా కాంగ్రెస్ పార్టీనే అడగాలి కదా?" అని వ్యాఖ్యానించారు. అయినప్పటికీ, ప్రజా సమస్య కాబట్టి బస్సు ఛార్జీల పెంపుపై తాము తప్పకుండా గళం విప్పుతామని హామీ ఇచ్చారు. గత అక్టోబర్‌లో టీజీఎస్ఆర్టీసీ బస్సు ఛార్జీలను పెంచిన విషయం తెలిసిందే. కాగా, కేటీఆర్ పోస్టుపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. కొందరు నెటిజన్లు ఛార్జీల పెంపును విమర్శిస్తుండగా, మరికొందరు కాంగ్రెస్‌కు ఓటు వేసి బీఆర్ఎస్‌ను ప్రశ్నించడం ఏంటని కామెంట్లు చేస్తున్నారు.