రేవంత్ భరతం పడతాం
జగదీశ్ రెడ్డి
భూ స్కాంలు చేస్తున్నడు
మా సర్కారు వచ్చినంక విచారణ
మాజీమంత్రి జగదీశ్ రెడ్డి
హైదరాబాద్, నవంబర్ 24 (ఈవార్తలు): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ భూకుంభకోణానికి పాల్పడుతున్నారని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపించారు. భవిష్యత్తులో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ భూకుంభకోణంపై విచారణ జరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి బహిరంగంగా పారిశ్రామిక వాడల భూములను విక్రయిస్తూ భారీ భూకుంభకోణానికి పాల్పడుతున్నారని విమర్శించారు. తదుపరి ప్రభుత్వం తమదేనని, ఈ భూకుంభకోణాలపై విచారణ జరిపి, విక్రయించిన వారిపై, కొనుగోలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. రేవంత్ రెడ్డి అరాచక పాలన సాగిస్తున్నారని, రాష్ట్రాన్ని పూర్తిగా దోచుకుంటున్నారని ఆయన దుయ్యబట్టారు. ఆయన తన అనుచరులకు ప్రభుత్వ భూములను కారుచౌకగా కట్టబెడుతూ భూకుంభకోణానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి డబ్బు సంపాదనే ధ్యేయంగా పెట్టుకున్నారని ఆయన విమర్శించారు. కోకాపేటలో ఎకరం రూ.170 కోట్లకు వేలంలో విక్రయించామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు అదే ప్రాంతంలో అతి తక్కువ ధరకు విక్రయించడంలో ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. ప్రజల ఆస్తులను దోచుకున్న వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని, వారు జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీ డిక్లరేషన్ హామీని విస్మరించిందని ఆయన అన్నారు. తెలంగాణ చరిత్రలో నవంబర్ 29 చిరస్థాయిగా నిలిచిపోతుందని జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. "తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ చచ్చుడో" అనే నినాదమే తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిందని ఆయన అన్నారు. రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ఆ రోజుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని ఆయన గుర్తు చేశారు. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షతో కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని ఆయన కొనియాడారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.