ప్రతి డివిజన్‌కు రూ.2 కోట్లు
ప్రతీకాత్మక చిత్రం
జీహెచ్ఎంసీ కార్పొరేటర్లకు గుడ్ న్యూస్
హైదరాబాద్, నవంబర్ 25 (ఈవార్తలు): హైదరాబాద్ లోని వివిధ డివిజన్లలో అభివృద్ధి పనుల కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు శుభవార్త చెప్పారు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ. మంగళవారం జరిగిన జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ లో కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతీ డివిజన్ కు 2 కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. డివిజన్ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాల కోసం నిధుల కేటాయించారు. మొత్తం 150 డివిజన్ల కు గాను 300 కోట్ల రూపాయలు కేటాయించినట్లు కౌన్సిల్ మీటింగ్ లో తెలిపారు. మరోవైపు మేయర్ గద్వాల విజయలక్ష్మీ అధ్యక్షతన చివరి కౌన్సిల్ సమావేశం కావడంతో కౌన్సిల్ చివరి సమావేశం సందర్భంగా మాట్లాడుతూ.. ప్రస్తుత పాలకవర్గం పూర్తి పదవీకాలానికి ముగింపు దశలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నగర అభివృద్ధికి సరికొత్త దశ,దిశ నిర్దేశించాం. హైదరాబాద్ అభివృద్ధి పట్ల అందరం కలిసి పనిచేసిన ప్రతి క్షణం నాకు చిరస్మరణీయం. ఈ బాధ్యతను నాపై ఉంచిన ప్రజలకు, రాష్ట్ర ప్రభుత్వానికి..నాతో కలిసి నడిచిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. దాదాపు ఈ 5 ఏండ్లలో నగరంలో రోడ్లు, డ్రైనేజ్, ఫ్లైవర్లు, జంక్షన్ ఇంప్రూవ్మెంట్ వంటి ప్రాథమిక సదుపాయాల మరింత విస్తరించా అని చెప్పారు. అదే విధంగా థీమ్ పార్కులు, అర్బన్ ఫారెస్ట్ ల ద్వారా పచ్చదనం పెంపునకు ప్రత్యేక కృషి చేశాం. పేద, మధ్య తరగతి ప్రజలు, నిరుద్యోగులు, చిరుద్యోగులకు 5 రూపాయల బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం. స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీలేని రుణాలు అందిస్తున్నాం. చివరి సమావేశం కావడంతో టీ బ్రేక్ లో కార్పొరేటర్లతో ఫోటో సెషన్ ఉంటుందని మేయర్ అన్నారు.2026 ఫిబ్రవరి 11తో కౌన్సిల్ గడువు ముగియనుంది. కార్పోరేటర్లు, సిటీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, బీజేపీ కార్పొరేటర్లు హాజరయ్యారు. కొత్తగా ఎన్నికైన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కూడా సమావేశానికి హాజరయ్యారు. 95 ప్రశ్నలు, 45 ఎజెండా అంశాలపై చర్చించారు.
వందేమాతరం గీతానికి అవమానం
జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ మీటింగ్ ఉద్రిక్తంగా మారింది. ఎంఐఎం, బీజేపీ సభ్యుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. బీజేపీ, ఎంఐఎం సభ్యులు కుర్చీలపైకి ఎక్కి ఆందోళన చేశారు. మేయర్ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్షల్‌తో బయటకు పంపుతానని అనడంతో గొడవవ సర్దుమణిగింది. కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది.. 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వందేమాతర గీతం ఆలాపనకు అవకాశం ఇవ్వాలని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కోరారు.. మేయర్ అంగీకారం తెలిపి.. అందెశ్రీకి నివాళికి చిహ్నంగా జయజయహే తెలంగాణ కూడా పాడుదాం అని కోరారు.. అయితే దీన్ని ఎంఐఎం తీవ్రంగా వ్యతిరేకించింది. అనంతనం.. సభలో వందేమాతరం గీతాలాపన కొనసాగింది. చెత్త బజార్ డివిజన్ కార్పొరేటర్ సోహెల్ వందేమాతరం గీతాలాపన సమయంలో నిలబడకుండా నిరసన తెలిపారు.. వందేమాతరం, జయ జయహే తెలంగాణ గీతాలాపన సమయంలో ఎంఐఎం కార్పొరేటర్లు కొందరు నిలబడకుండా నిరసన తెలుపుతూ కౌన్సిల్‌లో కూర్చుండిపోయారు. దీనిపై బీజేపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరు పార్టీల మధ్య వాగ్వాదం చోటు చేసుకుని తీవ్ర స్థాయికి చేరుకుంది. కౌన్సిల్‌లో వీళ్ల గలాటా కొనసాగుతుండగా.. మార్షల్ లోపలికి చేరుకున్నారు.. మనమేమైన రౌడీలమా? అంటూ మేయర్ విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్ర వాగ్వాదం మధ్య జీహెచ్ఎంసీ కౌన్సిల్ వాయిదా పడింది.