మా అమ్మ బతికే ఉంది: సీఎం రమేశ్
ప్రతీకాత్మక చిత్రం
అనకాపల్లి, నవంబర్ 24 (ఈవార్తలు): అనకాపల్లి లోక్‌సభ సభ్యుడు, బీజేపీ నేత సీఎం రమేశ్ తన తల్లి చింతకుంట రత్నమ్మ ఆరోగ్యంపై జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. తన తల్లి కన్నుమూశారంటూ కొన్ని మీడియా సంస్థలు, వాట్సాప్ గ్రూపుల్లో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని, వాటిని ఎవరూ నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం తన తల్లి హైదరాబాద్ హైటెక్ సిటీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ఆమె పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తున్నారని స్పష్టం చేశారు. ఈ విషయంపై సీఎం రమేశ్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా స్పందించారు. "తప్పుడు సమాచారాన్ని, వార్తల్ని ఎవరూ నమ్మొద్దు. నా తల్లి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ, డాక్టర్లు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్లిష్ట సమయంలో ఇలాంటి దుష్ప్రచారానికి ఎవరూ దోహదపడకండి" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబ శ్రేయస్సు కోరుతూ ప్రార్థనలు చేస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఈ అసత్య ప్రచారానికి ముగింపు పలకాలని కోరారు. రత్నమ్మ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన తర్వాత ఆమె ఆరోగ్యం మరింత క్షీణించినట్లు వైద్యులు వెల్లడించారు. అయినప్పటికీ, చికిత్స కొనసాగుతోందని, ఆమెను కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని భరోసా ఇచ్చారు. ఇలాంటి సున్నితమైన సమయంలో వ్యక్తిగత దురుద్దేశాలతో, రాజకీయ విమర్శలను జోడించి కొందరు కావాలనే ఈ తప్పుడు ప్రచారానికి తెరలేపారని సీఎం రమేశ్ ఆరోపించారు.