మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరు మార్చాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
చిదంబరం
చెన్నై: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరు మార్చాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇది జాతిపితను రెండోసారి హత్య చేయడమేనని ఆయన అభివర్ణించారు. యూపీఏ హయాంలో ప్రవేశపెట్టిన ఈ పథకం పేరును మార్చేందుకు ఉద్దేశించిన 'వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ లైవ్లీహుడ్ మిషన్ (రూరల్)' బిల్లును కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడిన చిదంబరం... "ఇన్నాళ్లూ జవహర్‌లాల్ నెహ్రూను అప్రతిష్ఠపాలు చేసిన బీజేపీ ప్రభుత్వం, ఇప్పుడు మహాత్మా గాంధీని లక్ష్యంగా చేసుకుంది" అని ఆరోపించారు. 2004 బడ్జెట్‌లో ఈ పథకాన్ని తానే ప్రకటించానని గుర్తుచేశారు. "భారతీయుల జ్ఞాపకాల నుంచి గాంధీని చెరిపేయాలని వారు ప్రయత్నిస్తున్నారు. పిల్లలకు గాంధీ గురించి తెలియకూడదు, ప్రజలు ఆయన పేరును స్మరించుకోకూడదు అన్నదే వారి ఉద్దేశం" అని ఆయన విమర్శించారు. ఈ పథకం పేరు మార్పును కాంగ్రెస్ మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మొదట ఈ పథకానికి 'పూజ్య బాపు గ్రామీణ ఉపాధి హామీ పథకం' అని పేరు పెడతారని భావించినప్పటికీ, దానికి భిన్నంగా కొత్త పేరును ప్రతిపాదించడంపై కాంగ్రెస్‌తో పాటు తృణమూల్ కాంగ్రెస్ వంటి ఇతర విపక్షాలు కూడా మండిపడుతున్నాయి. ఇదే సమయంలో బిల్లులకు కేవలం హిందీ పేర్లు పెట్టడంపైనా చిదంబరం స్పందించారు. వలసవాద ఛాయలను తొలగించేందుకే హిందీని వాడుతున్నామన్న ప్రభుత్వ వాదనను ఆయన తోసిపుచ్చారు. "భారత రాజ్యాంగమే ఆంగ్లంలో ఉంది. హిందీ, ఇంగ్లీష్ రెండూ అధికారిక భాషలుగా ఉంటాయని రాజ్యాంగం హామీ ఇస్తోంది" అని ఆయన గుర్తుచేశారు.