బీజేపీ సర్పంచ్‌ను గెలిపిస్తే 10 లక్షలు
బండి సంజయ్
కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆఫర్
కరీంనగర్, నవంబర్ 25 (ఈవార్తలు): కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మంగళవారం కీలక ప్రకటన చేశారు. తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో బీజేపీ మద్దతు ఉన్న సర్పంచ్ అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటే, ఆ గ్రామానికి తక్షణమే రూ.10 లక్షల అభివృద్ధి నిధులు అందిస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన వెంటనే బండి సంజయ్ ఈ ఆఫర్ ప్రకటించడం గమనార్హం. "మీ గ్రామంలో బీజేపీ బలపరిచిన సర్పంచ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే, ఎలాంటి జాప్యం లేకుండా, సాకులు చెప్పకుండా ఆ గ్రామానికి నేరుగా రూ.10 లక్షల నిధులు మంజూరు చేస్తా" అని బండి సంజయ్ 'ఎక్స్' వేదికగా స్పష్టం చేశారు. ఒక పార్లమెంట్ సభ్యుడిగా తన వద్ద ఎంపీ నిధులు అందుబాటులో ఉన్నాయని, ఇప్పటికే సీఎస్ఆర్ నిధుల ద్వారా కోట్లాది రూపాయలు తీసుకొచ్చి విద్య, వైద్య రంగాల్లో ఖర్చు చేశామని గుర్తుచేశారు. కేంద్ర మంత్రిగా మరిన్ని నిధులు తెచ్చి పంచాయతీల అభివృద్ధికి పాటుపడతానని ఆయన వివరించారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వాలపై బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఏకగ్రీవ పంచాయతీలకు రూ.5 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చిందని, ఆ మాటలు నమ్మి కరీంనగర్ పరిధిలో 70 గ్రామాలు బీఆర్ఎస్ అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నాయని అన్నారు. ఐదేళ్లు గడిచినా కేసీఆర్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని ఆరోపించారు. గతంలో కాంగ్రెస్ కూడా ఇలాంటి హామీలిచ్చి ప్రజలను మోసం చేసిందని, ఆ రెండు పార్టీల మాటలు నమ్మవద్దని ప్రజలను కోరారు. పొరపాటున కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్ మద్దతుదారులు గెలిస్తే కొత్త నిధులు రావని, కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా పక్కదారి పట్టే ప్రమాదం ఉందని హెచ్చరించారు.