ప్రజలను దోచుకునేదంతా ఆంధ్రా నిర్మాతలే
అనిరుధ్ రెడ్డి
నా దృష్టిలో ఐబొమ్మ రవి రాబిన్ హుడ్
జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
జడ్చర్ల, నవంబర్ 25 (ఈవార్తలు): వెయి కోట్ల రూపాయలు పెట్టుబడితో సినిమాలు నిర్మించి మూడు వేల కోట్లు సంపాదించాలని కొందరు ఆశిస్తున్నారని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అన్నారు. సినిమా నిర్మాతలల్లో 99 శాతం మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారేనని, అలాంటి వారు తెలంగాణలో ఉండి అధిక సంపాదన కోసం ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ వాసులు ఇలాంటి పనులు చేయరని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలను దోచుకునే వారంతా ఆంధ్రప్రదేశ్ నిర్మాతలేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు తన వద్దకు వచ్చి చెబుతున్న విషయాలనే తాను చెబుతున్నానని అనిరుధ్ రెడ్డి అన్నారు. సినిమా అనేది ఒక వ్యాపారమని ఆయన పేర్కొన్నారు. టిక్కెట్ ధరలు పెంచితే సినీ కార్మికులకు కూడా 20 శాతం వాటా ఇవ్వాలని ముఖ్యమంత్రి చెప్పిన విషయాన్ని తాను సమర్థిస్తున్నానని ఆయన అన్నారు. ఒక కమిషనర్ తన పక్కన సినిమా వాళ్లను పెట్టుకుని మీడియా సమావేశం నిర్వహించడం ప్రతికూల ప్రచారానికి దారి తీసిందని ఆయన అభిప్రాయపడ్డారు. సినిమాలు నష్టాలు మిగిల్చి రోడ్డున పడ్డ నిర్మాతలు కూడా ఉన్నారని ఆయన గుర్తు చేశారు. అధికారులు ఏ పని చేసినా, దానిని ప్రభుత్వానికే ఆపాదిస్తారని గుర్తుంచుకోవాలని ఆయన హితవు పలికారు. అధికారులు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని ఆయన కోరారు. ఐ-బొమ్మ రవి వ్యవహారాన్ని న్యాయస్థానాలు చూసుకుంటాయని అనిరుధ్ రెడ్డి తెలిపారు. దొంగతనం చేయడాన్ని ఎవరూ సమర్థించరని, అది తప్పేనని, కానీ ఎవరి వద్ద దొంగతనం చేశారనేది కూడా ఆలోచించాలని ఆయన ఆసక్తికర వ్యాఖ్య చేశారు. రాబిన్ హుడ్ పెద్ద వారి వద్ద దోచుకుని పేదలకు పంచి పెట్టాడని ఆయన గుర్తుచేశారు. ఐ-బొమ్మ రవిని ప్రజలు రాబిన్ హుడ్ అంటున్నారని, తాను కూడా అదే అంటున్నానని ఆయన పేర్కొన్నారు.