భారత 53వ సీజేఐగా
జస్టిస్ సూర్యకాంత్
జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణం
దైవసాక్షిగా హిందీలో ఓత్
శుభాకాంక్షలు తెలిపిన మోదీ
2027 ఫిబ్రవరి 9 వరకు పదవిలో
కేంద్ర మంత్రులు, విదేశీ న్యాయమూర్తులు హాజరు
న్యూఢిల్లీ: భారత 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణం చేశారు. సోమవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. అనేక చారిత్రాత్మక తీర్పుల్లో భాగస్వామి అయిన జస్టిస్ సూర్యకాంత్, ఇటీవలి సంప్రదాయానికి భిన్నంగా దైవసాక్షిగా హిందీలో ప్రమాణం చేయడం విశేషం. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జస్టిస్ సూర్యకాంత్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన పదవీకాలం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నట్లు తన సోషల్ మీడియా ఖాతా 'ఎక్స్' లో పేర్కొన్నారు.ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్, కేంద్ర మంత్రులు, హర్యానా ముఖ్యమంత్రి నాయిబ్ సింగ్ సైనీ హాజరయ్యారు. వీరితో పాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, భూటాన్, కెన్యా, మలేషియా, బ్రెజిల్, మారిషస్, నేపాల్, శ్రీలంక దేశాల ప్రధాన న్యాయమూర్తులు, ఇతర న్యాయమూర్తులు కూడా పాల్గొన్నారు.
పదవిలో 14 నెలలు
జస్టిస్ సూర్యకాంత్ సుమారు 14 నెలల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. ఆయన 2027 ఫిబ్రవరి 9న పదవీ విరమణ చేస్తారు. జస్టిస్ సూర్యకాంత్ పేరును జస్టిస్ భూషణ్ ఆర్ గవాయ్ సిఫార్సు చేయగా, అక్టోబర్ 30న కేంద్ర ప్రభుత్వం ఆయన నియామకానికి ఆమోదం తెలిపింది. 1962 ఫిబ్రవరి 10న హర్యానాలో జన్మించిన జస్టిస్ సూర్యకాంత్, 1984లో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. 2000వ సంవత్సరంలో హర్యానాకు అత్యంత పిన్న వయస్కుడైన అడ్వకేట్ జనరల్‌గా నియమితులయ్యారు. అనంతరం పంజాబ్-హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా, హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి, 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఆయన జాతీయ న్యాయ సేవల అథారిటీ (నల్సా)లో కూడా కీలక సేవలు అందించారు.
తొలిరోజే 17 కేసుల విచారణ
సీజేఐ హోదాలో జస్టిస్ సూర్యకాంత్ తొలిరోజునే కేవలం రెండు గంటల్లోనే 17 కేసులను విచారించారు. అదే సమయంలో ఒక కొత్త విధానపరమైన నియమాన్ని తీసుకువచ్చారు. ఇకపై అత్యవసరంగా విచారణకు స్వీకరించాల్సిన కేసుల (అర్జెంట్ లిస్టింగ్ కేసులు)ను తప్పనిసరిగా లిఖితపూర్వకంగా సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. మరణశిక్ష, వ్యక్తిగత స్వేచ్ఛకు విఘాతం కలిగే అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే మౌఖిక అభ్యర్థనలను అనుమతిస్తామని తెలిపారు. ప్రమాణం అనంతరం.. ఒకటో నెంబరు కోర్టు రూమ్‌లో జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ అతుల్ ఎస్. చందూర్కర్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనానికి ఆయన నేతృత్వం వహించారు. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రైవేటు సంస్థకు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును వెలువరించారు.