గుండెపోటును గుర్తించలేకపోతున్నాం!

గుండెపోటును గుర్తించలేకపోతున్నాం!

study on heart attack risk

ప్రతీకాత్మక చిత్రం

45 శాతం పరీక్షలు ముప్పును తేల్చలేకపోతున్నాయి

తాజా అధ్యయనంలో సంచలన విషయాలు

న్యూఢిల్లీ: గుండెపోటు ముప్పును అంచనా వేయడానికి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తున్న స్క్రీనింగ్ విధానాల్లో తీవ్రమైన లోపాలున్నాయని ఒక కొత్త అధ్యయనం తేల్చి చెప్పింది. ఈ లోపాల కారణంగా... నిజంగా ప్రమాదంలో ఉన్నవారిలో దాదాపు 45 శాతం మందిని గుర్తించలేకపోతున్నామని, ఇది అత్యంత ఆందోళన కలిగించే విషయమని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అమెరికాలోని మౌంట్ సినాయ్ పరిశోధకులు నేతృత్వం వహించిన ఈ అధ్యయనం, రోగుల సంరక్షణలో ఉన్న అతిపెద్ద లోపాన్ని ఎత్తిచూపింది. కేవలం రిస్క్ స్కోర్లు, వ్యాధి లక్షణాలపై మాత్రమే ఆధారపడితే గుండెపోటును నివారించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఈ అధ్యయన ఫలితాలను ‘జేఏసీసీ: అడ్వాన్సెస్’ జర్నల్‌లో ప్రచురించారు. ప్రస్తుతం వైద్యులు ఒక వ్యక్తికి గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని అంచనా వేయడానికి కొన్ని ప్రత్యేకమైన సాధనాలను (టూల్స్) ఉపయోగిస్తారు. వీటిలో అథెరోస్క్లెరోటిక్ కార్డియోవాస్కులర్ డిసీజ్ రిస్క్ స్కోర్, అలాగే ఇటీవలే వచ్చిన ప్రివెంట్ కాలిక్యులేటర్ ముఖ్యమైనవి. ఇవి ఒక వ్యక్తి వయస్సు, లింగం, రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలు, ధూమపానం వంటి అలవాట్లను బట్టి రిస్క్‌ను అంచనా వేస్తాయి. అయితే, ఈ పద్ధతులు ఎంతవరకు కచ్చితంగా పనిచేస్తున్నాయో తెలుసుకోవడానికి పరిశోధకులు 66 ఏళ్లలోపు వయసున్న, గతంలో ఎలాంటి గుండె జబ్బులు లేని 474 మంది రోగుల డేటాను విశ్లేషించారు. విశ్లేషణలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గుండెపోటు వచ్చిన రోగులను, కేవలం రెండు రోజుల ముందు గనక ఈ పద్ధతుల ద్వారా పరీక్షించి ఉంటే, వారిలో దాదాపు సగం మందికి తక్కువ లేదా సాధారణ ముప్పు ఉందని తేలేదని పరిశోధకులు తెలిపారు. అధ్యయనంలో పాల్గొన్న వారిలో 60 శాతం మందికి గుండెపోటు రావడానికి కేవలం రెండు రోజుల ముందు వరకు ఛాతీ నొప్పి, ఆయాసం వంటి ఎలాంటి లక్షణాలూ కనిపించలేదు. వ్యాధి ముదిరిపోయిన తర్వాతే లక్షణాలు బయటపడుతున్నాయని, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతోందని ఇది స్పష్టం చేస్తోంది.


అంబానీని మించేలా రేవంత్
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్