మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి: అడ్లూరి
అడ్లూరి లక్ష్మణ్
పెగడపల్లి, నవంబర్ 25 (ఈవార్తలు): మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. మంగళవారం ధర్మపురి నియోజకవర్గ పరిధిలోని పెగడపల్లిలో వడ్డీలేని ఋణాల పంపిణీ కార్యక్రమం ప్రారంభంతో పాటు, ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్, కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. రాష్ట్ర ప్రభుత్వం 3.50 లక్షల మహిళా సంఘాలకు 304 కోట్ల రూపాయల వడ్డీ లేని ఋణాలు సోమవారం విడుదల చేయగా జగిత్యాల జిల్లాలో 2025-26 వ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 11,825 స్వయం సహాయక సంఘాలకు రూ.10.69 కోట్లు వడ్డీ లేని ఋణాలు విడుదల అయ్యాయని తెలిపారు. మహిళలను అన్నిరంగాల్లో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నదని వెల్లడించారు. జిల్లాలో ఇప్పటివరకు 10853 ఇండ్లు మంజూరు అయ్యాయని, కొంతమంది లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణాలు పూర్తిచేసుకుని గృహ ప్రవేశ కార్యక్రమాలకు తమను ఆహ్వానించడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమలో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, ఆర్డీవో మధుసుధన్, డీఆర్డీవో రఘువరన్ , ఎమ్మార్వో, ఎంపీడీవో , స్థానిక ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.