సకాలంలో రాజన్న ఆలయం పూర్తి
ఆది శ్రీనివాస్
ఎమ్మల్యే, విప్ ఆది శ్రీనివాస్ వెల్లడి
ఆలయ విస్తరణ పనుల పరిశీలన
వేములవాడ, నవంబర్ 25 (ఈవార్తలు): వేములవాడ శ్రీ రాజేశ్వరస్వామి ఆలయ విస్తరణ పనులను ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ తో కలిసి మంగళవారం పరిశీలించారు. ఆలయ దక్షిణ భాగంలో భారీ యంత్రాలతో చేస్తున్న పనులను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. అంతకు ముందు వేములవాడ ఆర్టీసీ డిపో సమీపంలోని నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇండ్లను ప్రభుత్వ విప్ ఇంచార్జి కలెక్టర్ పరిశీలించారు. మొత్తం ఎన్ని ఇండ్లు నిర్మిస్తున్నారు? ఎప్పటి వరకు పూర్తి చేస్తారో ఆరా తీశారు. మొత్తం రూ. 5 కోట్ల 61 లక్షల వ్యయంతో 144 ఇండ్లు నిర్మిస్తున్నామని అధికారులు తెలిపారు. అక్కడి నుంచి నేరుగా మూలవాగుపై నిర్మిస్తున్న నూతన బ్రిడ్జి పనులను, వేములవాడ ప్రధాన ఆలయం నుంచి తిప్పాపూర్ బస్ స్టాండ్ వరకు నిర్మిస్తున్న రోడ్డు, డ్రైనేజ్ పనులను పరిశీలించారు. భీమేశ్వర ఆలయంలో భక్తుల కోసం చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు. షవర్లు, కళ్యాణకట్ట, క్యూ లైన్లు పరిశీలించి, ఆలయ ఈఓ, ఇంజనీరింగ్ అధికారులకు విప్, ఇంచార్జి కలెక్టర్ సూచనలు చేశారు.
భీమేశ్వర ఆలయంలో పూజలు
భీమేశ్వర ఆలయంలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా విప్, ఇంచార్జి కలెక్టర్ కోడె మొక్కు చెల్లించుకున్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, ఇంచార్జి కలెక్టర్‌కు ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేసి, ఆశీర్వాదం అందజేశారు. కార్యక్రమంలో వేములవాడ ఆర్డీవో రాధాభాయ్, ఆలయ ఈవో రమాదేవి, తహసీల్దార్ విజయ ప్రకాశ్ రావు తదితరులు పాల్గొన్నారు.