48 గంటల్లో బంగాళాఖాతంలో తుఫాను
ప్రతీకాత్మక చిత్రం
చెన్నై: హిందూ మహాసముద్రంలో ఒకేసారి మూడు కీలక వాతావరణ వ్యవస్థలు బలపడటంతో తమిళనాడుపై తుపాను గండం పొంచి ఉంది. రానున్న 48 గంటల్లో దక్షిణ బంగాళాఖాతంలో తుపాను ఏర్పడే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం (ఆర్ఎంసీ) హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన జారీ చేసింది. ఆర్ఎంసీ డైరెక్టర్ ఏ. ఆముద మీడియాకు వివరాలు వెల్లడించారు. హిందూ మహాసముద్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో మూడు ఆవర్తనాలు క్రియాశీలకంగా ఉన్నాయని తెలిపారు. అండమాన్ సముద్రంలో ఆదివారం ఏర్పడిన తీవ్ర వాయుగుండం పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ మలేషియా, మలక్కా జలసంధి సమీపంలో కేంద్రీకృతమై ఉందని చెప్పారు. ఇది రాబోయే 24 గంటల్లో మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా, ఆ తర్వాత 48 గంటల్లో తుపానుగా మారే అవకాశం ఉందని అంచనా వేశారు. మరోవైపు కన్యాకుమారి ప్రాంతంలో కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి ప్రభావంతో మంగళవారం కన్యాకుమారి సముద్రం, నైరుతి శ్రీలంక జలాల్లో కొత్త అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నాయని తెలిపారు. అరేబియా సముద్రంలోని మూడో ఆవర్తనం కూడా స్థిరంగా ఉందని, ఈ మూడు వ్యవస్థలు ఒకదానిపై ఒకటి ప్రభావం చూపే అవకాశం ఉందని ఆమె వివరించారు.