ఆహారోత్పత్తులను రైతుల వద్దే కొనండి!
ప్రతీకాత్మక చిత్రం
హోటళ్లకు కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి
న్యూఢిల్లీ: వ్యవసాయ ఉత్పత్తులను నేరుగా రైతుల వద్దే కొనాలని కేంద్రం సూచించింది. రైతుల ఉత్పత్తి సంస్థల (ఎఫ్‌పీవో) నుంచి కొనడం వల్ల సప్లై చైన్ నుంచి, మధ్యవర్తుల నుంచి రైతులకు ఉపశమనం కలుగుతుందని, రాబడి పెరుగుతుందని తెలిపింది. ముఖ్యంగా హోటళ్లు, రెస్టారెంట్లు రైతులతో నేరుగా సంబంధాలు పెట్టుకొని, ఆహారోత్పత్తులను కొనుగోలు చేయాలని కేంద్ర వ్యవసాయ శాఖ సెక్రటరీ డాక్టర్ దేవేశ్ చతుర్వేది కోరారు. జియోగ్రాఫికల్ ఇండికేషన్ ఉన్న ఉత్పత్తులను ప్రమోట్ చేయాలని చెప్పారు. దేశంలో మొత్తం 40,000 ఎఫ్‌పీవోలు ఉన్నాయని, వాటిలో 10 వేల ఎఫ్‌పీవోలను కేంద్ర ప్రభుత్వం స్థాపించిందని వెల్లడించారు. ఆహారోత్పత్తుల్లో నాణ్యత కూడా ప్రామాణికమని, రైతుల వద్దే అది దొరుకుతుందని తెలిపారు. ప్రస్తుతం శుభ్రమైన ఆహారాన్నే ప్రజలు కోరుకుంటున్నారని, అలాంటి ఆహార ఉత్పత్తులను అందించేందుకు రైతుల నుంచి కొనుగోలు చేయాలని సూచించారు. తద్వారా రైతు కూడా బాగుపడతారని అన్నారు. రైతులు కూడా సహజసిద్ధ వ్యవసాయ ఉత్పత్తులను పండించాలని పేర్కొన్నారు.