బస్సులు.. యమధర్మరాజులు!
ప్రతీకాత్మక చిత్రం
తమిళనాడు, ఉత్తరాఖండ్‌లో బస్సు ప్రమాదాలు
ఒకే రోజు 12 మంది దుర్మరణం
చెన్నై/డెహ్రాడూన్: బస్సెక్కితే ఇంటికి చేరేదాకా బతికి ఉంటామా? అన్న భయం పుడుతోంది. ఆర్టీసీ, ప్రైవేట్ అన్న తేడా లేకుండా వరుసపెట్టి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ఘటనల్లో మనుషులు పిట్టల్లా రాలుతున్నారు. తాజాగా సోమవారం నాడు తమిళనాడు, ఉత్తరాఖండ్‌లో జరిగిన బస్సు ప్రమాదాల్లో 12 మంది దుర్మరణం చెందారు. పూర్తి వివరాల్లోకెళితే.. తమిళనాడులోని తెన్కాశి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ప్రైవేట్ బస్సులు ఎదురెదురుగా వచ్చి ఢీకొనడంతో ఏడుగురు మృతి చెందగా, 30 మందికి పైగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యల్లో చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మధురై నుంచి సెన్‌కొట్టాయ్ వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు దురైసామిపురం ప్రాంతానికి రాగానే, ఎదురుగా తెన్‌కాశీ నుంచి వస్తోన్న మరో బస్సును బలంగా ఢీకొట్టింది. స్పాట్లో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు మరణించగా, మరోకరు చికిత్స పొందుతూ మరణించారు. మరో 30 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ప్రమాదం ధాటికి రెండు బస్సులు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. మరోవైపు, ఉత్తరాఖండ్‌లోని తెహ్రా జిల్లాలో బస్సు ప్రమాదం జరిగింది. భక్తులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి గుంటలో పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, 20 మంది గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సు 70 మీటర్ల లోతు ఉన్న లోయలో పడిపోయింది.