తెలంగాణ తెచ్చిందెవరు?.. కేసీఆర్. ఆ మాట చిన్న పిల్లాడిని అడిగినా చెప్తాడు. ఇంతకన్నా కేసీఆర్‌కు ఇంకేం కావాలి? ఇంకా దేనికోసం కేసీఆర్ ఎదురుచూస్తున్నరు? ఏ ఉద్యమకారుడికి దక్కని గౌరవం ఆయనకు దక్కింది. అటు ఉద్యమకారుడిగా, ఇటు పాలనాధికారిగా ఆయన స్థితి ఉన్నతమైనది. సాక్షాత్తు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా చెప్పిందిదే. కేసీఆర్.. నీ కన్నా అదృష్టవంతుడు ఇంకొకరు లేరు అని. దానికి తగ్గట్టే తెలంగాణ ప్రజలు కేసీఆర్‌కు రెండుసార్లు అవకాశం ఇచ్చారు. పాలనాధీశుడిగా రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో దేశానికి అందనంత ఎత్తులో నిలిచారు. మొత్తంగా చూస్తే.. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ఖ్యాతి గడించారు. ఇదంతా నాణేనికి ఒకవైపు. ఇంకోవైపు.. కేసీఆర్ సాధించింది ఏంటి? తెలంగాణ పదేళ్ల పాలన తర్వాత కేసీఆర్ చేతిలో మిగిలింది ఏంటి? ఇప్పుడు కళ్ల ముందు కనిపిస్తున్న సమాధానం మాత్రం శూన్యం. మధ్యలో వచ్చిన నాయకులు మధ్యలోనే పరార్ అయితున్నరు. ఇప్పుడు పోయేవాళ్లంతా, పోయినవాళ్లంతా కేసీఆర్ వచ్చేప్పుడు.. ఉద్యమం మొదలుపెట్టేప్పుడు తెచ్చుకున్నవాళ్లుకాదు. సరే.. పోతే పోనీ. అధికారమే లేనప్పుడు ఎవరిని అని ఏం ప్రయోజనం.
కేసీఆర్.. మీ పంతం పక్కన పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. కేసీఆర్.. మీ స్నేహశీలతను బయటికి తీయాల్సిన సందర్భం వచ్చేసింది. కేసీఆర్.. మీ ఆత్మీయులను కలుసుకోవాల్సిన తరుణం ఇదేనని అర్థం అవుతున్నది. ఎక్కడి తెలంగాణ ప్రాంతం.. ఎక్కడి తెలంగాణ రాష్ట్రం.. ఎక్కడి ఉద్యమం.. ఎక్కడి స్వరాష్ట్రం. మీ తోడుగా నిలిచినవాళ్లు మీ పక్కన ఉన్నది ఎంతమంది? మీ అడుగులో అడుగులు వేసినవాళ్లు ఇప్పుడు మీ అడుగు జాడల్లో ఉన్నది ఎంతమంది? నాడు మీతో కలిసి భోజనం చేసినవాళ్లలో ఇప్పుడు మీతో కలిసి తింటున్నది ఎంతమంది? మీతో కలిసి పల్లెలు తిరిగింది ఎంతమంది? బెల్లం ఉన్నకాడనే ఈగలు వాలేది.. ఈ సామెత గురించి మీకు విడమర్చి చెప్పేంత గొప్పవాడిని కాదు. కానీ, దాని పరమార్థం మీరు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఈ వయసులో మీకు ఇది కచ్చితంగా అవసరం. వాళ్లందరినీ మళ్లీ ఆప్యాయంగా పిలవాల్సిన అవసరం ఇప్పటిది. ఇది రాజకీయ పునరేకీకరణ అన్న విషయం తర్వాత.
మీరు పిలిస్తే కాళ్లకు గజ్జెలు కట్టుకొని వచ్చేవాళ్లు ఎంతో మంది ఉన్నారు. మీ పిలుపు కోసం నాటి సహచరులు, మీ స్నేహితులు, మీతో కలిసి నడిచిన ఉద్యమకారులు మీ పిలుపు కోసం ఎదురుచూస్తున్నరు. వాళ్లంతా అధికారం కోసం వచ్చేవాళ్లు కాదు. మీ కోసం, మీ బాగు కోసం, మిమ్మల్ని గొప్పగా చూడాలనుకొనేవాళ్లే. మీకు అహంకారం ఉంది అన్నది వాళ్లే కావొచ్చు. కానీ అంతకుమించిన ఆప్యాయత, ప్రేమ ఉందని చెప్పేదీ వాళ్లే. ఈ సత్యం మీరు గుర్తెరగాల్సిందే. రాజకీయ అవసరాల కోసం కేసీఆర్ పిలుస్తుండు అని అనుకున్నా ఫర్వాలేదు. కానీ వాళ్లు మీతో ఉంటే.. మీకు కొండంత బలం. వాళ్లకు ఆకాశమంత ఆనందం. ఆ ఆనందాన్ని మీతో పంచుకోవాల్సిన తరుణం వచ్చింది. బీఆర్ఎస్ గడ్డు పరిస్థితుల్లో ఉంది. రాజకీయ పార్టీగా అది కామన్. దాన్ని అధిగమించే శక్తినిచ్చేది నాటి మీ సహచరులే. మీ స్నేహితులే.
మీ కలిసి నడిచిన విజయరామారావుకు ఒక్క ఫోన్ కాల్ చేసి పిలవండి. విజయశాంతి, బొడిగె శోభకు ఒక్క కేక వేయండి. ఎంతమంది ఉద్యమకారులు వెళ్లిపోయారో వాళ్లకు ఒక వర్తమానం పంపండి. ఎంతమంది సహచరులు దూరమయ్యారో వాళ్లకు ఒక పిలుపు ఇవ్వండి చాలు. వాళ్లంతా మేం రాబోం అని అంటారా? ఆ సందేహమే అక్కర్లేదు. మీ వెన్నంటే ఉండే మీ అనుచరగణం వాళ్లు. మీ పంతం వీడితేనే తెలంగాణ రాష్ట్రం సుభిక్షం. మీరు ఒక మెట్టు దిగితేనే బీఆర్ఎస్ పార్టీకి మంచిరోజులు. ఇక్కడ మీకో విషయం చెప్పాలి.. మీ రాజకీయ పతనాన్ని శాసిస్తున్న నేతలు ఏ ఒక్క రోజూ మీ పాలనను ఎత్తి చూపలేదు. మీరు చేసిన అభివృద్ధి, సంక్షేమంపై పల్లెత్తు మాట అనలేదు. కేసీఆర్ అహంకారం వల్లే ఓడిపోయాడు అని అన్నారు. ఆ అహంకారం మీకు లేదని మీరు ప్రూవ్ చేసుకోవాల్సిన సమయం ఇది.
కేసీఆర్.. మలి ఉద్యమం మొదలుపెట్టిననాడు మీరు ఒక్కరే..
ఇప్పుడూ మీరొక్కరే.. మిగతావాళ్లంతా పాత్రధారులే..
ఒక్కొక్కరిగా సమూహ బలమై ఉద్యమంలో గెలిచారు..
తెలంగాణ ప్రజల బలంతో పాలనలో నిలిచారు..
ఇప్పుడు మలి పాలన ఉద్యమంలో నిలిచి గెలవాలి..
ఆ సమూహ బలాన్ని మళ్లీ సముపార్జన చేసుకోవాలి..
దానికి మీ సహచర, సోదర, స్నేహితులు ఉండాలి..
కేసీఆర్ పిడికిలెత్తాలి.. ఉద్యమకారులు గొంతెత్తాలి..
మరో చైతన్యం రావాలి.. తెలంగాణ నిలబడాలి
మళ్లీ కలుద్దాం.. (బీఆర్ఎస్ పోస్టుమార్టం పార్టు-4)తో..
Read This also:
సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్