బీఆర్ఎస్ పోస్టుమార్టం పార్టు-1 : చంద్రబాబు ధైర్యమేంటి.. కేసీఆర్‌‌కు ఉన్న ఇబ్బందులేంటి?

అధికారం ఉంది.. ఆర్థిక అండదండ ఉంది.. అనుచరగణం ఉంది.. అంతకుమించి తెలంగాణ ప్రజల మద్దతు ఉంది. ఇంకా బీఆర్ఎస్‌కు ఇంకేం కావాలి? పాలనలో కేసీఆర్‌ను మించినవారున్నారా? ఆయనకు తోడుగా కేటీఆర్, హరీశ్‌రావు లాంటి బాహువులు. జై తెలంగాణ అని నినదిస్తే.. కదిలివచ్చే గులాబీ సైన్యం. అంతా బాగానే ఉంది. కానీ, కేవలం 6 నెలల్లోనే ఎందుకు కుప్పకూలింది?

kcr

కేసీఆర్

తెలంగాణ ఉద్యమం నుంచి పుట్టిన పార్టీ..

ఎన్ని కష్టాలైనా ఎదుర్కోగల నాయకుడు..

ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెట్టగల చాణక్యుడు..

ఉద్యమ సారధి.. తెలంగాణ సాధించిన నేత..

వెరసి.. టీఆర్ఎస్ అలియాస్  బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేండ్ల అధికారం..

సీఎం పీఠంపై కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రజా సంక్షేమ పాలన..

అధికారం ఉంది.. ఆర్థిక అండదండ ఉంది.. అనుచరగణం ఉంది.. అంతకుమించి తెలంగాణ ప్రజల మద్దతు ఉంది. ఇంకా బీఆర్ఎస్‌కు ఏం కావాలి? పాలనలో కేసీఆర్‌ను మించినవారు ఎవరున్నారు? ఆయనకు తోడుగా కేటీఆర్, హరీశ్‌రావు లాంటి బాహువులు. జై తెలంగాణ అని నినదిస్తే.. కదిలివచ్చే గులాబీ సైన్యం. అంతా బాగానే ఉంది. కానీ, కేవలం 6 నెలల్లోనే ఎందుకు కుప్పకూలింది? అధికారంలో ఉన్నన్నాళ్లు ఎదురేలేని బీఆర్ఎస్.. ఇప్పుడు ఎందుకు ఢీలాపడింది. ఫీనిక్స్ పక్షిలా ఎగిరి రావొచ్చేమో! మళ్లీ అధికారం తమదే అన్న ఆశ ఉంటుందేమో! ఇవన్నీ సెకండరీ. అసలు ఒక్కసారిగా పార్టీ కేడర్ ఎందుకు ఛిన్నాభిన్నమైంది? అధికారం ఉన్నన్ని రోజులు గులాబీ రంగు పూసుకున్న నేతలు.. ఎందుకు పక్కదారి పడుతున్నారు? పార్టీకి ఎందుకీ క్షీణదశ? ఇలాంటి ప్రశ్నలకు జవాబు దొరకాలంటే పోస్టుమార్టం కచ్చితంగా చేయాల్సిందే.

తప్పులు ఎత్తిచూపితే కొందరికి కోపం రావచ్చు.. చేదు నిజం చెప్తే కొందరికి చెంపపై కొట్టినట్లు ఉండొచ్చు.. కానీ, భజనలు ఎందుకు? భజనపరులతో ఏం లాభం? చెప్పేదేదో నిక్కచ్చిగా చెప్పాల్సిందే. అందుకే ఇక్కడ టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ప్రస్తావన అనివార్యం. చంద్రబాబు చేసినదేంటి? కేసీఆర్ చేయనిది ఏంటి? మళ్లీ తెలంగాణలోకి వస్తాం అంటున్న చంద్రబాబు ధైర్యం ఏంటి? రాబోయే ఎన్నికల సన్నద్ధతతకు బీఆర్ఎస్‌లో లోపించిన అంశాలేంటి? అని ప్రశ్నలు వేసుకుంటే.. ఇట్టే తెలిసిపోతుంది కేడర్ బలం అని.

ఎంతటి తెలంగాణవాదులైనా.. తెలంగాణలో ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ అభిమానులు ఉన్నారు. ఇప్పటికీ పచ్చ జెండా పట్టుకోవడానికి రెడీగా ఉన్నారు. ఒకే ఇంట్లో తండ్రి టీడీపీ జెండా పట్టుకుంటే, కొడుకు బీఆర్ఎస్, బీజేపీ జెండాలు పట్టుకుంటున్న కుటుంబాలు కోకొల్లలు. కానీ, బీఆర్ఎస్ జెండా పట్టుకుంటున్న ఎంతమంది ఆ జెండాతోనే ఇప్పటికీ సాగుతున్నారు? కొందరు ఎందుకు పక్క జెండా కోసం ఉవ్విళ్లూరుతున్నారు? కారణం ఒక్కటే.. సంస్థాగతంగా బీఆర్ఎస్ బలంగా లేకపోవడమే.

ప్రభుత్వ పాలనపై దృష్టి పెట్టినంతగా, పార్టీ నిర్మాణంపై కేసీఆర్, కేటీఆర్ దృష్టిపెట్టలేదన్నది వాస్తవం. అంతెందుకు.. కేసీఆర్ పక్కనే, కేసీఆర్‌తో రాజకీయ వ్యూహాలు రచించిన కే కేశవరావు.. పార్టీ ఓడిపోగానే పార్టీ జంప్ అయ్యారు. ఇలాంటి నాయకత్వం కాదు కదా ఓ పార్టీకి కావాల్సింది. ఇప్పుడున్న నేతల్లో ఎంతమంది కష్టాల్లో పాలుపంచుకుంటారన్నది ప్రశ్న. ఏ ఎమ్మెల్యేను తట్టినా.. రేపు పార్టీలోనే ఉంటాడా? అన్న అనుమానం. పైగా, ఉద్యమంలో పార్టీని నమ్ముకున్న ఎంతోమంది క్షేత్రస్థాయి కార్యకర్తలు ఇప్పుడు పార్టీతో లేరు. ఇదే బీఆర్ఎస్‌కు అతిపెద్ద మైనస్. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే.. స్థానిక నేతలు వరదలా దూసుకొచ్చారు. అధికారం పోగానే అంతే వేగంగా పార్టీలు మారారు.

కేటీఆర్ ఒక మాట అంటున్నారు.. పార్టీ వీడినవాళ్లను మళ్లీ పార్టీలోకి తీసుకోబోం అని. అధికారం మారగానే, పార్టీలు మారే నేతలను ఎందుకు చేర్చుకుంటున్నట్టు? అన్న ఒక ప్రశ్న సగటు బీఆర్ఎస్ కార్యకర్త మదిలో మెదులుతున్నది. వచ్చే స్థానిక ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ పోటీ చేస్తుందని చంద్రబాబు సంకేతాలు ఇచ్చారు. అంటే.. తెలంగాణకు పదేళ్లు దూరమైనా, పార్టీ కేడర్ బలంగా ఉందని ఆయన నమ్మటమే అందుకు కారణం. అంతటి నమ్మకాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సాధించలేకపోయారు. తొమ్మిదిన్నరేండ్లు అప్రతిహత విజయాలతో, అపర చాణక్యంతో కేసీఆర్ పాలన సాగించారు. కానీ, ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఏముంది? ఏం మిగిలింది?

పార్లమెంట్ ఎన్నికల్లో సున్నా సీట్లు.. అనేక సీట్లలో డిపాజిట్ గల్లంతు.. ఇంతకుమించి సంక్షోభం ఏముంది? ఇప్పటికైనా మించిపోయింది లేదు.. క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం చేస్తేనే బీఆర్‌ఎస్‌కు మనుగడ. పునాది పటిష్ఠంగా ఉంటేనే, ఇల్లు పదికాలాలపాటు నిలబడుతుంది. అందుకు ఉదాహరణే.. టీడీపీ. ఇప్పుడు అలాంటి పటిష్టతే బీఆర్ఎస్‌కు కావాల్సింది. ఐదేళ్ల క్రితం ఏపీలోనూ టీడీపీ పని అయిపోయింది అని అన్నారు. లోకేశ్ పనికిరాడు.. చంద్రబాబు పగ్గాలు ఇక ఎన్టీఆర్‌కు అప్పగించి పార్టీని జాకీలు పెట్టి లేపాలి అని కామెంట్లు చేశారు. నిజమే.. చంద్రబాబు ఈ ఎన్నికల్లోనూ ఓడిపోయి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది? కానీ.. అలా జరగలేదు. కేవలం ఐదేళ్లలోనే పార్టీని 23 సీట్ల నుంచి 131 సీట్లకు అమాంతం పెంచారు చంద్రబాబు. ఇది ఆయన వల్ల సాధ్యం కాలేదు.. పార్టీ పటిష్టతే ఆయనకు ఆ సీట్లు తెచ్చిపెట్టింది.

కేసీఆర్ చేయాల్సింది కూడా అదే.. కేడర్‌కు పూర్తి భరోసా కల్పించడం. మేం ఉన్నామంటూ ముందుండి నడిపించడం. పార్టీని ప్రక్షాళన చేసి, పునర్నిర్మించడం ముఖ్యం. కేసీఆర్ పని అయిపోయింది అని చాలామందే అంటున్నారు. కానీ, కేసీఆర్ ఎంత మొండివాడో అందరికీ తెలియాల్సిన అవసరం ఇప్పుడొచ్చింది. కేసీఆర్ నిరూపించుకొనేది ఏదీ లేదు అంటే తప్పు. తెలంగాణ సాధన కోసం యావత్తు తెలంగాణ కేసీఆర్ వైపు నిలిచింది. ఇప్పుడు అదే తెలంగాణ.. అవతలి ఒడ్డుపై చూస్తూ ఉంది. ఇలాంటి సమయంలోనే కేసీఆర్ తన చాణక్యాన్ని ప్రదర్శించాల్సింది. ఎత్తులకు పైఎత్తులు వేయడం తెలిసిన నాయకుడు.. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తేనే మొదలవుతుంది గులాబీ జెండా పున:ప్రస్థానం.

(నోట్: బీఆర్ఎస్ ఓటమిపై పోస్టుమార్టం నివేదికను పార్టులుగా ప్రచురిస్తాం)


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్