కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలను వెలికితీసేందుకు సీబీఐ విచారణకు ఆదేశిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు అసెంబ్లీలో సంచలన ప్రకటన చేశారు.
- దోచుకున్నవాళ్లందరికీ శిక్ష పడాలి
- నిజాయతీతో విచారణ జరగాలి
- సీబీఐ ఎంక్వైరీకి ఆదేశిస్తున్నాం
- కమిషన్‌ను తప్పుదారి పట్టించే యత్నం
- అవినీతిపై ఏ ఒక్కరినీ వదిలేది లేదు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి
- విచారణపై శాసనసభలో తీర్మానం
- అనంతరం అసెంబ్లీ నిరవదిక వాయిదా
హైదరాబాద్, ఆగస్టు 31 (ఈవార్తలు): కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలను వెలికితీసేందుకు సీబీఐ విచారణకు ఆదేశిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు అసెంబ్లీలో సంచలన ప్రకటన చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై అసెంబ్లీలో వాడీవేడీ చర్చ జరిగింది. అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగింది. చివరగా మాట్లాడిన సీఎం రేవంత్.. కాళేశ్వరం అవకతవకల్లో ఎవరినీ వదిలేది లేదని, నిర్ణయం తీసుకున్నాకే ఇక్కడి నుంచి కదులుతామని స్పష్టం చేశారు. అన్నట్లుగానే సీబీఐకి కేసు అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. కమిషన్ నివేదికపై చర్చ సందర్భంగా మాట్లాడిన సీఎం.. ప్రాజెక్టుకు సంబంధించి అవినీతిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం అన్నారు. ‘రూ.లక్ష కోట్లు వృథా అయ్యాయనే బాధ మాకూ ఉంది. నీరు కావాలనే డిమాండ్‌పై ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నాం. బంగారం కంటే మనకు నీరే ముఖ్యం. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజ్‌లపై విచారణ చేపట్టాం. జస్టిస్ పీసీ ఘోష్‌కు ఎంతో అనుభవం ఉంది. అనేక తీర్పులు ఇచ్చారు. అన్నీ ఆలోచించే ఏకసభ్య కమిషన్ వేశాం. అనేక దర్యాప్తు సంస్థల నివేదికలను జస్టిస్ ఘోష్ కమిషన్‌కు ఇచ్చాం. కాళేశ్వరం నివేదికను పూర్తిగా చదవాలని అక్బరుద్దీన్‌ను కోరుతున్నాం. నివేదిక పూర్తిగా చదవకుండా మాపై లేనిపోని ఆరోపణలు చేయొద్దు. ప్రతి సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తా. ఎన్‌డీఎస్‌ఏ, విజిలెన్స్, కాగ్ నివేదికలను జస్టిస్ ఘోష్‌కు ఇచ్చాం. అందరి నుంచి కమిషన్ వివరాలు సేకరించింది. వాస్తవాలు వక్రీకరించి మాట్లాడితే చూస్తూ ఊరుకోలేం. మీ సలహాలు, సూచనలు తీసుకునేందుకు నివేదికను మీ ముందుంచాం. అవినీతిపరులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రతి విషయాన్ని నివేదికలో ప్రస్తావించరు కదా.. అక్బర్ నా మిత్రుడు.. జోకులు వేసినా సరదాగా తీసుకుంటా. సర్కారుతో మాత్రం జోకులు వేయవద్దని కోరుతున్నా. దర్యాప్తు సంస్థల నివేదికలన్నీ కమిషన్‌కు ఇచ్చాం. బాధ్యులైన గత ప్రభుత్వ పెద్దలను కూడా పిలిచి ప్రశ్నించాం. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాం. జస్టిస్ ఘోష్ కమిషన్‌ను పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించారు. 8బీ, 8సీ కింద నోటీసు ఇవ్వలేదంటూ కేసీఆర్, హరీశ్ రావు కోర్టుకు వెళ్లారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక చెల్లదని కోర్టులో పిటిషన్ వేశారు. విద్యుత్ కమిషన్‌పై కూడా కేసీఆర్ కోర్టుకు వెళ్లారు. 8బీ, 8సీ కింద నోటీసు ఇచ్చారని వారే గతంలో కోర్టుకు వెళ్లారు. అవినీతి సొమ్ము రికవరీ ఎలా చేయాలో సూచనలు చేయవచ్చు. సిట్, సీఐడీ, ఐటీ, ఈడీ, సీబీఐ.. ఎవరి ద్వారా రికవరీ చేయాలో నిర్ణయిస్తాం. నిర్ణయం తీసుకోకుండా ఎలా ఉంటాం. ఎవరినీ వదిలేది లేదు. నిర్ణయం తీసుకున్నాకే ఇక్కడి నుంచి కదులుతాం. అంబానీ, అదానీ కంటే ఎక్కువ సంపాదించాలని గత పాలకులు కోరుకున్నారు’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణకు ఆదేశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టగా ఆమోదం తెలిపింది. అనంతరం సభను నిరవదికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.