అగ్నిమాపక శాఖలో కొత్త జీవో చిచ్చు.. ఫైర్‌మెన్‌కు గుదిబండలా నిబంధనలు

అగ్నిమాపక శాఖలో పనిచేస్తున్న ఫైర్‌మెన్లకు కొత్త జీవో గుదిబండలా మారింది. ఒకే పోస్టులో, జీతం పెంపు లేకుండానే రిటైర్‌మెంట్‌ దాకా కాలం వెల్లదీయాల్సిన దుస్థితి కల్పిస్తోంది. జాయినింగ్‌ ఆర్డర్‌ సమయంలో లేని కొత్త నిబంధనలు తీసుకురావడంతో ఏం చేయాలో పాలుపోక ఫైర్‌మెన్‌ నరకం అనుభవిస్తున్నారు.

fire department

ప్రతీకాత్మక చిత్రం

- హెవీ లైసెన్స్‌ ఉంటేనే పదోన్నతి

- జాయినింగ్‌ ఆర్డర్‌లో లేని రూల్‌

- ఇప్పటికిప్పుడు హెవీ లైసెన్స్‌ ఎలా?

- లేకపోతే వార్షిక వేతన పెంపు బంద్‌

- ఇప్పటికే డబుల్‌ డ్యూటీలతో సతమతం

- స్టేషన్‌ డ్యూటీ, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ విధులు

- నరకం అనుభవిస్తున్న ఫైర్‌ సిబ్బంది

(ఈవార్తలు- ప్రత్యేకం)

అగ్నిమాపక శాఖలో పనిచేస్తున్న ఫైర్‌మెన్లకు కొత్త జీవో గుదిబండలా మారింది. ఒకే పోస్టులో, జీతం పెంపు లేకుండానే రిటైర్‌మెంట్‌ దాకా కాలం వెల్లదీయాల్సిన దుస్థితి కల్పిస్తోంది. జాయినింగ్‌ ఆర్డర్‌ సమయంలో లేని కొత్త నిబంధనలు తీసుకురావడంతో ఏం చేయాలో పాలుపోక ఫైర్‌మెన్‌ నరకం అనుభవిస్తున్నారు. అసలేం జరిగిందంటే.. ఈ ఏడాది జూలై 11న ఇచ్చిన జీవో నంబరు 86తో అగ్నిమాపక శాఖలో మంటలు చెలరేగాయి. ఫైర్‌మెన్లకు హెవీ డ్రైవింగ్‌ లైసెన్స్‌ కచ్చితంగా ఉండాలని, లేకపోతే ప్రమోషన్‌, వేతన పెంపు ఉండబోదన్న నిబంధనలు శరాఘాతంగా మారాయి. నియామక సమయంలో లేని నిబంధనలు కొత్తగా అమలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ జీవోకు పొడగింపు అన్నట్లుగా ప్రభుత్వం కొత్త సర్వీస్‌ రూల్స్‌ లిస్టును ఈ నెల 18న విడుదల చేసింది. దీంతో పైఅధికారుల తీరును సిబ్బంది తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఆదరాబాదరాగా జీవోలు ఇచ్చి, లేని కండీషన్ల పెట్టి తమ జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని వాపోతున్నారు. ఎన్ని విన్నపాలు, విజ్ఞప్తులు చేసుకుంటున్నా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకెళితే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1992లో ఇచ్చిన జీవో నంబరు 568 ప్రకారమే నియామకాలు, పదోన్నతులు కొనసాగుతూ వస్తున్నాయి. ఫైర్‌మెన్లకు లీడిరగ్‌ ఫైర్‌మెన్లుగా, డ్రైవర్‌ ఆపరేటర్లకు ఎస్‌ఎఫ్‌వోగా ప్రమోషన్‌ వచ్చేది. తెలంగాణ వచ్చాక అగ్నిమాపకశాఖలో పదోన్నతులకు ప్రత్యేకంగా మ్యానువల్‌ తీసుకురాకపోవడంతో పాత పద్ధతిలోనే పదోన్నతులు కొనసాగాయి. అయితే, కొత్త నిబంధనలు రూపొందించకపోవడంపై కొందరు హైకోర్టును ఆశ్రయించారు. అప్పటి వరకు నియామకాలు, పదోన్నతులు నిలిపివేయాలని కోర్టును కోరారు. దీంతో తెలంగాణ ఫైర్‌ సర్వీసెస్‌ సబార్డినేట్‌ సర్వీస్‌ నిబంధనల డ్రాప్ట్‌ను సిద్ధం చేయాలని హైకోర్టు ఆదేశించింది. పలు వాయిదాల తర్వాత కూడా నిబంధనల డ్రాఫ్ట్‌పై నాలుగు వారాల గడువు కావాలని ప్రభుత్వ న్యాయవాది కోరటంతో అసంతృప్తి వ్యక్తం చేసిన ధర్మాసనం..  జూలై 17లోగా డ్రాఫ్ట్‌ సమర్పించాలని, లేకపోతే సీఎస్‌ వ్యక్తిగతం కోర్టుకు హాజరు కావాలని స్పష్టం చేసింది.

ఆగమేఘాలపై జీవో నంబరు 86

హైకోర్టు జూలై 17 వరకు నిబంధనలు విధించడంతో.. ఆలోగా డ్రాఫ్ట్‌ సిద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిరది. దీంతో జూలై 11నే కొత్త నిబంధనలతో హోంశాఖ జీవో నంబరు 86ను విడుదల చేసింది. పోస్టుల పేర్లు మార్చుతూ ఆ జీవో విడుదల చేసింది. లీడిరగ్‌ ఫైర్‌మెన్‌ను లీడిరగ్‌ ఫైర్‌ ఫైటర్‌గా, డ్రైవర్‌ ఆపరేటర్‌ పోస్టును ఫైర్‌ ఫైటర్‌ (టెక్నికల్‌)గా, ఫైర్‌మెన్‌ పోస్టును ఫైర్‌ ఫైటర్‌గా మార్పు చేసింది. అంతేకాదు, ఆ జీవో ప్రకారం.. ఫైర్‌మెన్లు నేరుగా ఎల్‌ఎఫ్‌ కాలేరు. ఎల్‌ఎఫ్‌ కావాలంటే డ్రైవర్‌ ఆపరేటర్‌గా పనిచేయాలి. ఆ తర్వాతే ఎల్‌ఎఫ్‌గా ప్రమోషన్‌ లభిస్తుంది. డ్రైవర్‌ ఆపరేటర్‌ కావాలంటే హెవీ డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉండాల్సిందే. 1992 రూల్స్‌ ప్రకారం.. హెవీ డ్రైవింగ్‌ లైసెన్స్‌ అవసరం లేదు. కానీ, ఇప్పుడు హెవీ డ్రైవింగ్‌ లైసెన్స్‌ అడుగుతుండటంతో ఫైర్‌మెన్లు దిక్కులు చూడాల్సిన పరిస్థితి తలెత్తింది. ఉన్నఫలంగా కొత్త జీవో తెచ్చి, పదోన్నతి కావాలంటే కచ్చితంగా హెవీ డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉండాల్సిందేనని నిబంధన విధించడంతో ఫైర్‌మెన్లకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. డ్రైవింగ్‌లో ఎలాంటి అనుభవం లేని ఫైర్‌మెన్లు డ్రైవర్‌ ఆపరేషర్‌గా ప్రమోషన్‌ తీసుకోవడం కాని పని. అదీకాకుండా, ఈ నెల 18న విడుదల చేసిన నిబంధనల ప్రకారం.. వార్షిక వేతనం పెంపు ఉండాలన్నా ఫైర్‌మెన్లకు హెవీ డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉండాల్సిందే. ఆ లెక్కన, హెవీ డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకపోతే.. జీవితాంతం అదే పోస్టులో, అదే జీతంతో పనిచేయాల్సిన దుస్థితి ఏర్పడిరది. ఉదాహరణకు.. 2011లో ఉద్యోగంలో చేరిన ఒక ఫైర్‌మెన్‌, ఎల్‌ఎఫ్‌ సగటు వయసు 25 ఏళ్లు అనుకున్నా.. ఇప్పటికి 40 ఏళ్లు నిండుతాయి. అంటే.. 40 ఏళ్ల వయసులో ఒక ఫైర్‌మెన్‌ హెవీ డ్రైవింగ్‌ లైసెన్స్‌ కోసం వెళ్లాల్సిన పరిస్థితి. సాంకేతికంగా అది సాధ్యం కాదు. అప్పటికే కుటుంబం, పిల్లలు, ఉద్యోగంతో సతమతమవుతూ ఉంటాడు. అలాంటిది కొత్తగా హెవీ డ్రైవింగ్‌ లైసెన్స్‌ నేర్చుకోవాలని, లేకపోతే ఉద్యోగమే ఉండదని, జీతం పెంపు ఉండదని జీవోలు ఇవ్వడం ఎంతవరకు సమంజసం అని సిబ్బంది వాపోతున్నారు.

రిక్రూట్‌మెంట్‌ జరిగిందిలా..

2024 వరకు తెలంగాణ అగ్నిమాపక శాఖలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న నిబంధనల ప్రకారమే రిక్రూట్‌మెంట్‌ జరిగింది. 1992లో ఇచ్చిన జీవో నంబరు 568 ప్రకారమే పోస్టుల భర్తీ జరుగుతుందని కూడా నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్‌ వరకు కూడా ఆ జీవో ప్రకారమే పదోన్నతులు కొనసాగాయి. జీవో నంబరు 568లో.. ఫైర్‌మెన్‌లకు లీడిరగ్‌ ఫైర్‌మెన్‌ (ఎల్‌ఎఫ్‌)గా పదోన్నతి కల్పించనున్నట్లు పేర్కొన్నారు. పదోన్నతి పొందాలంటే హెవీ డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందాలన్న నిబంధనేదీ లేదు. ఇప్పటి వరకు హెవీ డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండానే ప్రమోషన్లు లభించాయి కూడా. 

భోజన వసతికీ ఇబ్బంది

డ్యూటీల విషయంలోనూ ఫైర్‌ సిబ్బంది తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. అటు స్టేషన్‌లో డ్యూటీ, ఇటు.. ఎస్‌డీఆర్‌ఎఫ్‌ డ్యూటీ చేస్తూ శారీరకంగా, మానసికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులకు తోడు పైఅధికారుల చీవాట్లు అదనం. పైగా, సిబ్బంది కొరత అగ్నిమాపక శాఖకు విఘాతంగా మారింది. ప్రతి స్టేషన్‌కు కనీసం 10 మంది ఫైర్‌మెన్లు ఉండాల్సి ఉండగా, ఏ స్టేషన్‌లోనూ 5-6గురికి మించి లేకపోవడం గమనార్హం. ఆ సిబ్బందిని కూడా ఎస్‌డీఆర్‌ఎఫ్‌ డ్యూటీలకు తీసుకెళ్తే, స్టేషన్‌లో ఒకరిద్దరే మిగులుతారు. రెండు, మూడు చోట్ల ఒకేసారి అగ్నిప్రమాదం జరిగినా, భారీ అగ్నిప్రమాదం జరిగినా సిబ్బంది కొరతతో ఇబ్బందులు తప్పవు. ఆశ్చర్యకర విషయం ఏంటంటే.. ఎస్‌డీఆర్‌ఎఫ్‌ డ్యూటీకి వెళ్లిన సమయంలో భోజన వసతితో తమకు సంబంధం లేదని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో ట్రైనింగ్‌ సమయంలోనూ భోజన వసతి ఇచ్చేదే లేదని ఖరాఖండీగా చెప్తున్నారని.. డ్యూటీలో ఉండీ సొంతంగా ఎలా వసతి చూసుకోగలుగుతామని వాపోతున్నారు.

రెండున్నరేళ్లు దాటినా అదే పదవిలో..

సాధారణంగా ఒక పోలీస్‌ అధికారిని రెండున్నరేళ్లకు మించి ఒక పోస్టులో కొనసాగించే పరిస్థితి ఉండదు. గతంలో అలాంటి సందర్భాలే లేవు. కానీ ప్రస్తుత డీజీ నాగిరెడ్డి గత ప్రభుత్వం నుంచి అదే పదవిలో కొనసాగుతున్నారు. గతంలో నార్త్‌ జోన్‌ ఏడీజీగా ఉన్న ఆయనను 2023 జనవరిలో అప్పటి ప్రభుత్వం డీజీగా ప్రమోషన్‌ ఇచ్చి తెలంగాణ రాష్ట్ర విపత్తుల నిర్వహణ, అగ్నిమాపక శాఖల బాధ్యతలు అప్పగించింది. ఆ బాధ్యతలు చేపట్టి ఇప్పటికే రెండున్నరేళ్లు గడిచిపోయింది కూడా. అయినా, ఆయన పోస్టును మార్చేందుకు ప్రభుత్వం ఎందుకు సాహసం చేయలేకపోతోంది? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్