బీఆర్ఎస్ పోస్టుమార్టం పార్టు-2 : కేసీఆర్ మాటల్లో.. జగన్ మాటల్లో అదే తేడా..!

కేసీఆర్ వ్యాఖ్యలే తెలంగాణ ప్రజలను నొప్పించిందన్నది వాస్తవం. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆయా సభల్లో మాట్లాడిన కేసీఆర్.. ‘‘మీ జీవితాలు బాగుండాలంటే నాకే ఓటేయాలి. నాకు ఓటేయకపోతే, ఇంటికి పోయి పడుకుంట. నాకేం పోయేది లేదు’’ అని చేసిన వ్యాఖ్యలు ప్రజలను ఆలోచించేలా చేశాయి.

jagan kcr

జగన్, కేసీఆర్

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి.. తెలంగాణ సాధించిన నేత.. పదేళ్ల పాటు తెలంగాణను ఏలిన నాయకుడు.. ఇలా చెప్పుకుంటూపోతే కేసీఆర్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలంగాణపరంగా పొగడ్తలు కేసీఆర్‌కు దక్కాల్సినవేనన్న మాటకూ తెలంగాణ సమాజం ఓకే చెప్తుంది. కానీ, గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్‌కు ఎందుకు ఓటు వేయలేదు? కేసీఆర్‌ను పొడిగిన నోళ్లే.. తమ చేతి వేళ్లతో వేరే పార్టీ గుర్తుకు ఎందుకు ఓటేశారు? కేసీఆర్ అంటే కోపమా? అసహ్యమా? ద్వేషమా? ఈ ప్రశ్నలకు సమాధానం.. కాదు. కేసీఆరే ఉండాలి అనుకొని కూడా వేరే పార్టీకి ఓటేసినవాళ్లెందరో. అందులో కేసీఆర్ అభిమానులు, కేసీఆర్ మద్దతుదారులు, కేసీఆర్ అనునూయులూ ఉన్నారు. మరి ఓటు ‘చేతి’ గుర్తుకు మారింది ఎందుకు?

నోరు మంచిదైతే ఊరు మంచిదైతది.. అన్న సామెతను ఇక్కడ ప్రస్తావించుకోవాలి. ఈ మాట కొందరు బీఆర్ఎస్ హార్డ్ కోర్ ఫ్యాన్స్‌కు నొప్పించి ఉండొచ్చు. కేసీఆర్ అంటే కోసుకునేవాళ్లకు కోపం తెప్పించి ఉండొచ్చు. కానీ, వీళ్ల నొప్పి కంటే.. తెలంగాణ ప్రజల గుండెల్లో నొప్పి ఇంకా ఎక్కువ. ఎందుకు అంటే.. కేసీఆర్ వ్యాఖ్యలే తెలంగాణ ప్రజలను నొప్పించిందన్నది వాస్తవం. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆయా సభల్లో మాట్లాడిన కేసీఆర్.. ‘‘మీ జీవితాలు బాగుండాలంటే నాకే ఓటేయాలి. నాకు ఓటేయకపోతే, ఇంటికి పోయి పడుకుంట. నాకేం పోయేది లేదు’’ అని చేసిన వ్యాఖ్యలు ప్రజలను ఆలోచించేలా చేశాయి. గెలిచినప్పుడు అధికారాన్ని అనుభవించి, ఓడిపోయాక ఇంటికి వెళ్లి పడుకుంటాడా.. అని తమ ఆగ్రహాన్ని ఓటు రూపంలో చూపించారు. దానికి దక్కిన ప్రతిఫలమే.. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి. అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాతైనా.. ఆ వ్యాఖ్యలను సమీక్షించుకుంటే బాగుండేది. కానీ, అలా జరగలేదు.

బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత ప్రజల ముందుకు వచ్చి కేసీఆర్ సంజాయిషీ ఇచ్చుకోలేదు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రమే మీడియాతో మాట్లాడి వెళ్లిపోయారు. కానీ, ప్రజలు కోరుకున్నది కేసీఆర్ మాట్లాడాలని. ఎందుకంటే తెలంగాణ పెద్దగా కేసీఆర్‌ను వాళ్లు నిలబెట్టారు కాబట్టి. కేసీఆర్ మాట్లాడితేనే ప్రజల్లో కాస్త కోపం తగ్గి ఉండేది. పైగా, కరెంటు పోతే.. మార్పు కావాలన్నారుగా. మార్పు వచ్చిందా? అంటూ దెప్పిపొడిచే కామెంట్లు ప్రజలను మరింత నొప్పించాయి. ప్రజలు బాధలో ఉన్నప్పుడు అలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంత వరకు సమంజసం? ‘‘నన్ను ఓడగొట్టుకున్నరు. ప్రజలు కాంగ్రెస్ వాళ్ల మాటలు నమ్మిండ్రు’’ అని ప్రజలే తప్పుచేశారన్న విధంగా మాట్లాడిన తీరు మరింత బాధను కలిగించాయి. అప్పుడు సగటు తెలంగాణ పౌరుడి నుంచి వచ్చిన మాట ఏంటో తెలుసా.. ‘‘కేసీఆర్‌కు ఇంకా అహంకారం తగ్గలేదురా’’ అని. దానికి దక్కిన మరో ప్రతిఫలం.. లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం.

వాస్తవానికి ఏ పార్టీ అయినా ఎన్నికల్లో ఓడిపోతే.. ఓటమికి కారణాలను సమీక్షించుకోవాలి. ప్రజలు ఎందుకు ఓటు వేయలేదు అని ఆలోచించాలి. కానీ, బీఆర్ఎస్ పార్టీలో అలాంటి అంతర్మథనం జరగలేదనే పై వ్యాఖ్యలను బట్టి అవగతం అవుతోంది. ఒకవేళ సమీక్ష జరిగి ఉంటే.. ఇలాంటి కామెంట్లు ఎందుకు చేశారు? అన్నది ఇక్కడ ప్రశ్న. మరో అంశం ఏంటంటే.. ప్రజలే దేవుళ్లు అన్నది నానుడి. కానీ, నేనే దేవుడిని, ప్రజలు భక్తులే అన్న విధంగా ప్రవర్తించడం ప్రజాస్వామ్యంలో ఎంత మంచిది కాదన్నది తెలుసుకోవాల్సిన అవసరం కచ్చితంగా ఉంది. ప్రజాస్వామ్య భారతదేశంలో కేసీఆర్ లాంటి ప్రజాస్వా్మ్యవాది, లౌకికవాది ఇలా ప్రవర్తించడం ఏంటి? అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇలాంటి వ్యక్తిత్వాలను ప్రజలను గర్వం, అహంగా భావిస్తారు. తెలంగాణలో జరిగింది అదే. కేసీఆర్‌ను పక్కనపెట్టాల్సిందేరా! అని నిర్ణయించుకున్నారు.

అదే సమయంలో.. ఏపీ మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలను ఓ సారి పరిశీలిస్తే వ్యత్యాసం ఏంటో తెలుస్తుంది. వైసీపీ ఓటమి అనంతరం తానే స్వయంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములు, అవ్వాతాతలు చూపిన కోట్లాది ప్రేమలు, ఆప్యాయతలు ఎక్కడికి పోయాయో అర్థం కావటం లేదని నిట్టూర్చారు. జగన్ వ్యాఖ్యల్లో బాధ కనిపించింది. ఆ వ్యాఖ్యలు ఆంధ్ర, తెలంగాణ ప్రజల ప్రతి గుండెను తాకాయి. కళ్ల ముందు ఓటమి.. ఎవరిని అని నిందించాలి.. దానికి ఆధారాలే లేవు కదా.. అని అన్న మాట టీడీపీ, జనసేన నేతలనూ కదిలించాయంటే అతిశయోక్తి కాదు. జగన్ వ్యాఖ్యలు ఏదో అలా చెప్పాలని చెప్పినవి కావు. నమ్మకం వంచించినప్పుడు పుట్టిన బాధలోంచి వచ్చినవి. ఇలాంటి వ్యాఖ్యలే ప్రజల్లో మళ్లీ నిలబెడతాయి. ప్రజల్లోకి వస్తే మళ్లీ స్వాగతిస్తాయి.

మరి జగన్ కంటే అనుభవంలో, పాలనలో ఎంతో గొప్పవారైన కేసీఆర్‌కు ఇది తెలియదా? తెలుసు. ఆ వ్యాఖ్యల్లో లోతును తెలుసుకొని, ప్రజల ముందుకు రావాలి. కేసీఆర్ అంటేనే ప్రజల మనిషి. ఆ మనిషి ప్రజల్లోనే ఉండాలి. ఫీనిక్స్ పక్షిలా మళ్లీ ఎగురుతాం అని కేటీఆర్ అన్నారు. యస్.. ఆ స్పిరిట్ ఉండాలి. బీఆర్ఎస్ అనేది పెత్తందారుల పార్టీ కాదని, ప్రజల పార్టీ అని నిరూపించుకోవాల్సిన తరుణం వచ్చింది. అలాంటి పార్టీ నిర్మాణమే ఇప్పుడు జరగాలి. ఇకనుంచైనా కేసీఆర్ మాట్లాడే ప్రతి మాట తెలంగాణ గుండెలను హత్తుకోవాలి. మళ్లీ కారు రేస్‌లోకి రావాలని ఆకాంక్షిస్తూ..



సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్