డిసెంబర్ 30 నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు
ప్రతీకాత్మక చిత్రం
టికెట్ల బుకింగ్ షెడ్యూల్ విడుదల చేసిన టీటీడీ
తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తున్నది. ఇందులో భాగంగా సామాన్య భక్తులకు పెద్దపీట వేసేలా పలు నిర్ణయాలు తీసుకుంది. వైకుంఠ ద్వార దర్శనాల విధి, విధానాలు విడుదల చేసింది. వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వాదశి, నూతన సంవత్సరం సందర్భంగా తొలి మూడు రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు అంటే డిసెంబర్ 30, 31, జనవరి 1వ తేదీలకు సంబంధించి ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా సర్వ దర్శన టోకెన్లను ఆన్‌లైన్ లో కేటాయించనున్నారు. కుటుంబ సభ్యులందరికీ అందుబాటులో ఉండే విధంగా వన్ ప్లస్ త్రీ విధానంలో టోకెన్లు జారీ చేయనున్నట్లు చెప్పింది. నవంబర్ 27 నుంచి డిసెంబర్ ఒకటి వరకు ఎలక్ట్రానిక్ డిప్ నమోదుకు అవకాశం ఇచ్చింది. తొలి మూడురోజులకు వైకుంఠ ద్వారా దర్శనాలకు ఈ నెల 27న ఉదయం 10 గంటల నుంచి డిసెంబర్ ఒకటి సాయంత్రం 5 గంటల వరకు టీటీడీ వెబ్‌సైట్ ttdevasthanams.ap.gov.in, మొబైల్ యాప్, వాట్సాప్ లో ఏపీ గవర్నమెంట్‌బాట్‌లో టీటీడీ ఆలయాల విభాగంలో ఎలక్ట్రానిక్ డిప్‌లో వివరాలు నమోదు చేసుకోవాలని చెప్పింది. డిసెంబర్ 2న మధ్యాహ్నం 2 గంటలకు డిప్ వివరాలు ప్రకటించనున్నట్లు చెప్పింది. అనంతరం డిసెంబర్ 30, 31, జనవరి 1వ తేదిల్లో దర్శనం కావాల్సిన రోజులను, మూడు రోజులను ప్రయారిటీగా ఎంపిక చేసుకునే అవకాశం కూడా కల్పిస్తున్నట్లు పేర్కొంది. వైకుంఠ ద్వార దర్శనాల నేపథ్యంలో డిసెంబర్ 30 నుండి జనవరి 8 వరకు శ్రీవారి ఆలయంలో చంటి పిల్లల తల్లిదండ్రులు, వృద్ధులు, వికలాంగులు, డిఫెన్స్, ఎన్ఆర్ఐ తదితర ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. జనవరి 6, 7, 8 వ తేదీల్లో స్థానికులకు స్థానికుల కోటా కింద దర్శనం కల్పించనున్నట్లు పేర్కొంది.