సకల దోషాలను తొలగించే స్కంద షష్ఠి

సకల దోషాలను తొలగించే స్కంద షష్ఠి

skanda shashti

ప్రతీకాత్మక చిత్రం

ప్రతి నెల శుక్ల పక్షంలో వచ్చే షష్ఠి తిథిని 'స్కంద షష్ఠి' లేదా 'కుమార షష్ఠి' అని పిలుస్తారు, ఇది శివపార్వతుల తనయుడు కుమారస్వామి (కార్తికేయుడు/మురుగన్)కి అంకితం చేయబడిన అత్యంత పవిత్రమైన రోజు. దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ మరియు కర్ణాటక రాష్ట్రాలలో ఈ పండుగను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. పురాణాల ప్రకారం, కార్తికేయ స్వామి శూరపద్ముడు మరియు తారకాసురుడు వంటి రాక్షసులను సంహరించి, లోకానికి శాంతిని కలిగించిన రోజును స్కంద షష్ఠిగా జరుపుకుంటారు. ఇది చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. నవంబర్ 25వ తేదీ అంటే మంగళవారం.. సాయంత్రం 6.56 గంటలకు షష్ఠి తిథి ప్రారంభమవుతుంది. నవంబర్ 26వ తేదీ.. బుధవారం రాత్రి 7.14 గంటలకు ఈ తిథి వెళ్లిపోతుంది. సూర్యోదయానికి ఉన్న తిథి ప్రకారం పండగ జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో నవంబర్ 26వ తేదీ సుబ్రహ్మణ్య షష్ఠి జరుపుకుంటారు. పంచమి రోజు.. ఉపవాసం ఉండి షష్ఠి నాడు శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధిస్తే నాగదోషాలు తొలగిపోతాయిని పండితులు చెబుతారు. సంతానం లేని దంపతులు ఈ రోజున ప్రత్యేక పూజలు చేసి, ఉపవాసం పాటిస్తే, కార్తికేయుడి అనుగ్రహంతో సంతాన సౌభాగ్యం కలుగుతుందని ప్రగాఢ నమ్మకం. సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల జాతకంలోని కుజ దోషం, నాగ దోషం వంటి సమస్యలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. స్కంద షష్ఠి వ్రతాన్ని ఆచరించడం ద్వారా భక్తులకు జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు తొలగిపోతాయి, ప్రతికూల శక్తుల నుండి రక్షణ లభిస్తుంది మరియు సకల విజయాలు, సుఖ సంతోషాలు చేకూరుతాయి.

- విద్యారాణి వూరడి


అంబానీని మించేలా రేవంత్
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్