చిన్నారుల ముందు అసభ్య నృత్యం.. హోంగార్డు సస్పెండ్
ప్రతీకాత్మక చిత్రం
కృష్ణా, నవంబర్ 25 (ఈవార్తలు): ఓ ప్రైవేట్ వేడుకలో అశ్లీల నృత్యం చేసిన హోంగార్డుపై కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు కఠిన చర్యలు తీసుకున్నారు. క్రమశిక్షణ ఉల్లంఘన కింద అతడిని సస్పెండ్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వివరాల్లోకి వెళితే.. కృష్ణా జిల్లాలో హోంగార్డుగా పనిచేస్తున్న అజయ్ కుమార్ ఇటీవల ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్నాడు. అక్కడ డీజే పాటలకు ఓ యువతితో కలిసి చిన్నారుల ఎదుటే అసభ్యకరంగా నృత్యం చేశాడు. ఈ దృశ్యాలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ అయింది. ప్రభుత్వ ఉద్యోగిగా, పోలీసు శాఖకు చెందిన వ్యక్తిగా యూనిఫామ్ గౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వీడియో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో వారు తీవ్రంగా స్పందించారు. దీనిపై విచారణకు ఆదేశించిన ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, హోంగార్డు క్రమశిక్షణను ఉల్లంఘించినట్లు నిర్ధారించారు. పోలీసు శాఖ ప్రతిష్ఠకు భంగం కలిగించే ఇలాంటి చర్యలను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తక్షణమే అజయ్ కుమార్‌ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు