మరోసారి పోలీస్ కస్టడీకి ఐ-బొమ్మ రవి!

మరోసారి పోలీస్ కస్టడీకి ఐ-బొమ్మ రవి!

ravi

ఐ-బొమ్మ రవి

నాంపల్లి కోర్టులో సైబర్ క్రైమ్ పోలీసుల పిటిషన్

నేడు తీర్పు వెలువరించనున్న కోర్టు

నాంపల్లి/హైదరాబాద్, నవంబర్ 25 (ఈవార్తలు): పైరసీ వెబ్‌సైట్ ఐ-బొమ్మ నిర్వాహకుడు ఇమంది రవిని మరోసారి కస్టడీకి తీసుకోవడానికి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అతనిని అరెస్టు చేసిన అనంతరం పోలీసులు వారం రోజుల కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేయగా, న్యాయస్థానం ఐదు రోజుల కస్టడీకి అనుమతించింది. దీంతో ఐదు రోజుల పాటు రవిని కస్టడీకి తీసుకుని పోలీసులు విచారించారు. అతని నుంచి కీలక వివరాలు రాబట్టారు. రవి నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు మరోసారి కస్టడీకి తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలో నాంపల్లి కోర్టులో ఏడు రోజుల కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. పోలీస్ కస్టడీపై కోర్టు రేపు తీర్పును వెలువరించనుంది. ఐదు రోజుల పాటు అతడిని విచారించిన పోలీసులు పలు విషయాలను మీడియాకు వెల్లడించారు. ఐ-బొమ్మ రవి అతి విశ్వాసంతో ఉన్నాడని, ఒంటరిగా ఉంటూ, వారానికో దేశం తిరిగేవాడని విచారణలో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఈజీ మనీకి అలవాటు పడ్డాడని, లక్ష డాలర్లు వెచ్చించి కరేబియన్ దీవుల పౌరసత్వం కొనుగోలు చేశాడని వెల్లడించారు.

భార్య కాదు.. మేమే పట్టుకున్నాం

భార్య ఇచ్చిన సమాచారంతోనే ఐ-బొమ్మ రవి పట్టుబడ్డాడనే ప్రచారంలో వాస్తవం లేదని, ఆమెను పోలీసులు విచారించనే లేదని సైబర్ క్రైమ్ అడిషనల్ సీపీ శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఐ-బొమ్మ రవి కేసు వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. కస్టడీలో రవి నుంచి కీలక విషయాలు రాబట్టామని తెలిపారు. ఐ-బొమ్మ వెబ్‌సైట్‌ను రవి మరో కంపెనీ నుంచి హోస్ట్ చేస్తున్నట్లు గుర్తించామన్నారు. డొమైన్‌ను ఓ వెబ్ హోస్టింగ్ కంపెనీలో రిజిస్టర్ చేశాడని, కంటెంట్ మేనేజ్‌మెంట్ సిస్టం ద్వారా రవి సినిమాలు పోస్టు చేసేవాడని తెలిపారు. ఐ-బొమ్మ, బప్పం వెబ్‌సైట్ల ద్వారా రవి సినిమాలను పోస్టు చేసేవాడని, ఆయా వెబ్ సాఫ్ట్‌వేర్‌లలో రీడైరెక్ట్ స్క్రిప్ట్ రాశాడని వెల్లడించారు. దీని ద్వారా గేమింగ్, బెట్టింగ్ వెబ్‌సైట్లకు మళ్ళించేవాడని అన్నారు. మూవీరూల్జ్ వంటి పైరసీ వెబ్‌సైట్లు ఇంకా నడుస్తున్నాయని ఆయన తెలిపారు. భవిష్యత్తులో వెబ్-3 సాంకేతికత రానుందని, దాని ద్వారా పైరసీ చేస్తే పట్టుకోవడం కష్టమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఐ-బొమ్మ రవి అతి విశ్వాసంతో ఉన్నాడని, పైరసీ వ్యవహారాల దర్యాప్తు సంక్లిష్టంగా ఉంటుందని అన్నారు. ఐ-బొమ్మ రవి ఒంటరిగా ఉంటూ, వారానికో దేశం చొప్పున తిరిగేవాడని, ఈజీ మనీకి అలవాటు పడ్డాడని, లక్ష డాలర్లు వెచ్చించి కరేబియన్ దీవుల పౌరసత్వం కూడా కొనుగోలు చేశాడని తెలిపారు. మూవీరూల్జ్, తమిళ్ఎంవీ లాంటి పైరసీ వెబ్‌సైట్లు నిర్వాహకులను పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నామని వెల్లడించారు.


అంబానీని మించేలా రేవంత్
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్