అండర్ 19 కెప్టెన్‌గా హైదరాబాదీ
అఫ్గానిస్థాన్ అండర్ 19 జట్టుతో జరిగే ముక్కోణపు సిరీస్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) రెండు జట్లను ప్రకటించింది. అండర్ 19 భారత్-ఏ, అండర్ 19 భారత్-బీ జట్లు అఫ్గానిస్థాన్ అండర్ 19 టీమ్‌తో ముక్కోణపు సిరీస్ ఆడనుంది. అండర్ 19 ఏ జట్టుకు విహాన్ మల్హోత్రా సారథ్యం వహిస్తుండగా.. అండర్ 19 బీ జట్టుకు సారథ్యం వహించే అవకాశం హైదరాబాద్ కుర్రా ఆరోన్ జార్జ్‌కు దక్కింది. ఆరోన్ జార్జ్ ఇటీవల ముగిసిన ప్రతిష్టాత్మక దేశవాళీ అండర్ 19 టోర్నీ వినూ మన్కడ్ ట్రోఫీలో హైదరాబాద్ జట్టుకు సారథ్యం వహించాడు. అసాధారణ ప్రదర్శన, సారథ్యంతో హైదరాబాద్ జట్టును విజేతగా నిలబెట్టాడు. ఆరోన్ గత కొంతకాలంగా మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. వినూ మన్కడ్ ట్రోఫీలో అతను గత మూడేళ్లుగా టాప్ స్కోరర్‌గా నిలుస్తూ వచ్చాడు. ఇటీవల ముగిసిన ఎడిషన్‌లోనే 2 సెంచరీల సాయంతో 373 పరుగులు చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న అండర్ 19 చాలెంజర్ ట్రోఫీలో కూడా అతను నిలకడైన ప్రదర్శన చేస్తున్నాడు. స్కూల్ క్రికెట్‌లో సత్తా చాటిన ఆరోన్ జార్జ్‌కు 2022లో హైదరాబాద్ అండర్ -16 జట్టులో చోటు దక్కింది. విజయ్ మర్చంట్ ట్రోఫీలో సత్తా చాటిన అతను ఒక ట్రిపుల్ సెంచరీతో పాటు 511 పరుగులు సాధించాడు. ఈ ప్రదర్శనతో ఆరోన్‌కు మంచి గుర్తింపు దక్కింది. ప్రస్తుతం అతను హైదరాబాద్‌లోని భవాన్స్ కాలేజీలో బీకామ్ మొదటి ఏడాది చదువుతున్నాడు.