భారత్‌-దక్షిణాఫ్రికా టెస్టుకు భారీ భద్రత

భారత్‌-దక్షిణాఫ్రికా టెస్టుకు భారీ భద్రత

delhi blast security alert in kolkata

ప్రతీకాత్మక చిత్రం

దేశ రాజధాని ఢిల్లీ నగరంలోని ఎర్రకోట సమీపంలో కారులో బ్లాస్ట్‌ జరిగింది. ఈ ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. 20 మందికిపైగా గాయపడ్డారు. అయితే, ఈ నెల 14 నుంచి కోల్‌కతా వేదికగా భారత్‌-దక్షిణాఫ్రికా జట్ల మధ్య టెస్టు మ్యాచ్‌ జరుగనున్నది. ఢిల్లీ ఘటన నేపథ్యంలో ఈడెన్‌ గార్డ్స్‌, కోల్‌కతాలో భద్రతను కట్టుదిట్టం చేశారు. శుక్రవారం నుంచి ప్రారంభంకానున్న టెస్టుకు ఆతిథ్యం ఇవ్వనున్న ఐకానిక్‌ స్టేడియంతో నగరంలోని కీలక ప్రాంతాల్లో ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టినట్లు కోల్‌కతా పోలీస్‌ కమిషనర్‌ మనోజ్‌ వర్మ పేర్కొన్నారు. తామంతా హై అలెర్ట్‌లో ఉన్నామని.. ఢిల్లీ పేలుడును దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక, అదనపు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. స్థానిక పోలీసులతో పాటు స్పెషల్ టాస్క్ ఫోర్స్ ను మోహరించనున్నారు. లాల్‌బజార్‌లోని పోలీస్ వర్గాలు ఈడెన్ గార్డెన్స్ వద్ద మూడు అంచెల భద్రతా వలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పోలీస్‌ వర్గాలు తెలిపాయి. స్టేడియం చుట్టూ, ఎంట్రీ గేట్స్‌, ప్రేక్షకుల స్టాండ్స్‌ను కవర్‌ చేయడంతో పాటు మైదానం చుట్టుపక్కల కదలికలను కఠినంగా పర్యవేక్షించనున్నారు. మెటల్‌ డిటెక్టర్లు, హ్యాండ్‌హెల్డ్‌ స్కానర్స్‌లను ఉపయోగించి ముమ్మరంగా తనిఖీలు చేయనున్నట్లు తెలిపారు. స్టేడియం లోపల, వెలుపల సాధారణ దుస్తులు ధరించిన పోలీసులు సిబ్బందిని మోహరిస్తామని.. ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలు గుర్తించి వేగంగా స్పందించనున్నట్లు అధికారులు చెప్పారు. బ్యాగులు, నిషేధిత వస్తువులతో స్టేడియంలోపలికి అనుమతి ఉండదని పోలీసులు పేర్కొన్నారు. శాసనసభ, రాజ్‌భవన్‌, కోల్‌కతా హైకోర్టు, స్టేడియం దగ్గరగా ఉన్న ఆల్‌ ఇండియా రేడియో చుట్టూ భద్రతను సైతం పెంచారు. ప్రోటోకాల్స్‌ను విషయంలో సమీక్ష చేసేందుకు బెంగాల్‌ క్రికెట్‌ అసోసియేషన్‌, సీనియర్‌ పోలీసు అధికారుల మధ్య సమావేశం జరిగింది. దాంతో పాటు భారత జట్టు, దక్షిణాఫ్రికా జట్లు బస చేసిన హోటల్స్‌ వద్ద సైతం నిఘాను పెంచారు. భారత కోచ్ గౌతమ్ గంభీర్ కాళీఘాట్ ఆలయానికి వెళ్లాలని యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, ప్రస్తుతం ఢిల్లీ పేలుళ్ల నేపథ్యంలో ఆలయ సందర్శన వాయిదా వేసినట్లు సమాచారం.


రాజన్న ఆలయం మూసివేత
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్