రషీద్ ఖాన్ రెండో పెళ్లి?
రషీద్ ఖాన్
అఫ్గానిస్థాన్ క్రికెట్ జట్టు స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ తన రెండో పెళ్లి విషయంపై వార్తల్లో నిలిచారు. సోషల్ మీడియాలో ఓ మహిళతో రషీద్ ఖాన్ దిగిన ఫోటో వైరల్ అవుతుండటంతో ఆయన స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా దీనిపై స్పష్టతనివ్వాల్సి వచ్చింది. రషీద్ ఖాన్ ఈ ఏడాది ఆగస్టులోనే వివాహం చేసుకున్నట్లు సమాచారం. నెదర్లాండ్స్‌లో జరిగిన ఒక చారిటీ ఈవెంట్ ప్రారంభోత్సవానికి రషీద్ ఖాన్ వెళ్లారు. ఈ కార్యక్రమంలోనే రషీద్‌తో పాటు ఆ మహిళ కూడా కనిపించారు. ఈ ఫొటో బయటకు రాగానే రకరకాల చర్చలు మొదలయ్యాయి. దాంతో రషీద్ ఖాన్ స్వయంగా ఆమె తన భార్య అని ప్రపంచానికి తెలియజేశారు. అయితే ఆమె ఆయన రెండో భార్యా? అనే విషయంలో గందరగోళం కొనసాగుతోంది. రషీద్ ఖాన్ తన వైరల్ ఫొటోపై ఇచ్చిన వివరణ కారణంగానే ఈ గందరగోళం మరింత పెరిగింది. తన పోస్ట్‌లో రషీద్ ఖాన్ ఇలా రాసుకొచ్చారు. "2 ఆగస్టు 2025న నా జీవితంలో కొత్త ప్రారంభం జరిగింది. నాకు నిఖా జరిగింది. నేను ఎల్లప్పుడూ కోరుకునే ప్రేమ, శాంతి, భాగస్వామ్యాన్ని సూచించే ఒక మహిళను వివాహం చేసుకున్నాను. నేను ఇటీవల నా భార్యను ఒక ఛారిటీ ఈవెంట్‌కు తీసుకువెళ్లాను, కానీ దురదృష్టవశాత్తు దీని గురించి ప్రజలు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. అయితే నిజం ఏమిటంటే, ఆమె నా భార్య, ఇది దాచాల్సిన విషయం కాదు." అని రషీద్ ఖాన్ పేర్కొన్నారు.