తెలంగాణ నుంచి సివిల్స్ ఇంటర్వ్యూకు 43 మంది
ప్రతీకాత్మక చిత్రం
న్యూఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన సివిల్ సర్వీసెస్ (మెయిన్స్) పరీక్ష ఫలితాల్లో తెలంగాణ అభ్యర్థులు హవా కొనసాగించారు. దేశవ్యాప్తంగా ఆగస్టు 22 నుంచి 31 వరకు జరిగిన మెయిన్స్‌లో మొత్తంగా 2,736 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూ లేదా పర్సనాలిటీ టెస్ట్ రౌండ్‌కు ఎంపికైనట్లు యూపీఎస్సీ ప్రకటించింది. ఈ మేరకు మెయిన్స్ రాత పరీక్షలో క్వాలిఫై అయిన విద్యార్థుల రోల్ నంబర్లు, పేర్లతో వేర్వేరుగా జాబితాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఇందులో 43మంది అభ్యర్థులు తెలంగాణ నుంచి ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. గత ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన 140 మంది అభ్యర్థులు రూ.లక్ష చొప్పున రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం పొందగా.. 20మంది మెయిన్స్‌లో క్వాలిఫై అయ్యారు. ఈ ఏడాది 202 మందికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించగా.. వారిలో 43 మంది ఇంటర్వ్యూ దశకు చేరుకున్నారు. ఈ 43 మంది అభ్యర్థులకు త్వరలోనే మరో రూ.లక్ష చొప్పున ఆర్థిక ప్రోత్సాహకాన్ని ప్రభుత్వం అందించనుంది.