ఒక్క భాగస్వామ్యమే టర్నింగ్ పాయింట్: బవుమా
భారత్‌ను వారి సొంతగడ్డపై ఓడించడం చాలా సంతోషంగా ఉందని సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా తెలిపాడు. ఈ విజయంలో తమ బౌలర్లు కీలక పాత్ర పోషించారని చెప్పాడు. రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా కోల్‌కతా వేదికగా ఆదివారం ముగిసిన తొలి టెస్ట్‌లో సౌతాఫ్రికా 30 పరుగుల తేడాతో టీమిండియాను చిత్తు చేసింది. 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకుంది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన టెంబా బవుమా.. ఈ ఉదయం(మూడో రోజు ఆట) కార్బిన్ బోష్‌తో తాను నెలకొల్పిన భాగస్వామ్యం తమ విజయానికి బాటలు వేసిందన్నాడు. 'ఈ మ్యాచ్ గెలవడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి మరిన్ని మ్యాచ్‌ల్లో భాగం కావాలని, ఫలితం మావైపు ఉండాలని కోరుకుంటున్నా. ఈ మ్యాచ్‌లో పుంజుకోవడం చాలా కష్టమైంది. మా బౌలర్లు అద్భుత ప్రదర్శనతో తిరిగి ఆటలోకి తీసుకువచ్చారు. తరుచుగా బౌలర్లను మార్చడం మాకు కలిసొచ్చింది. మా బౌలర్లు బంతిని అందించినప్పుడల్లా మమ్మల్ని ఆటలోకి తీసుకు వచ్చారు. ఈ ఉదయం కార్బిన్ బోష్‌తో నేను నమోదు చేసిన భాగస్వామ్యం టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. ఈ ఉదయం వికెట్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది. అయితే 120 పరుగులే చేసి ఫలితాన్ని ఆశించడం కాస్త కష్టమే. నా కెప్టెన్సీ గురించి మాట్లాడాలంటే జట్టులోని ఆటగాళ్లు రాణిస్తేనే కెప్టెన్ సక్సెస్ అవుతాడు. కాబట్టి నా కెప్టెన్సీ క్రెడిట్ వారికే ఇస్తాను. బ్యాటింగ్‌లో నా టెక్నిక్‌తో సౌకర్యంగా ఉన్నాను. మెరుగైన ప్రదర్శన చేయాలనే బలమైన కోరికతో ఇక్కడికి వచ్చాను. భారత్‌లో నాకు మెరుగైన రికార్డ్ లేదు. దాన్ని మెరుగు పర్చాలనే లక్ష్యంతో బరిలోకి దిగాను. తొలి ఇన్నింగ్స్‌లో నా ప్రణాళికలకు తగ్గట్లు ఆడలేకపోయాను. రెండో ఇన్నింగ్స్‌లోనూ నా బ్యాటింగ్‌ను పెద్దగా మార్చలేదు. కండిషన్స్‌కు తగ్గట్లు ఆడాను. అదృష్టం కూడా కలిసొచ్చింది. రబడా లేకున్నా.. కేశవ్, సైమన్ అదరగొట్టారు. ఈ ఇద్దరితో మా బౌలింగ్ విభాగం బలంగా మారింది. అక్షర్ పటేల్ క్యాచ్ అంత సులువైనది కాదు. కీలకమైన సమయంలో అక్షర్ జోరు మీదున్న సమయంలో తప్పు చేశాడు. ఆ అవకాశాన్ని నేను అందిపుచ్చుకున్నాను.'అని టెంబా బవుమా చెప్పుకొచ్చాడు.