భాగ్యశ్రీకి భాగ్యం దక్కేనా?
భాగ్యశ్రీ బోర్సే
భాగ్యశ్రీ బోర్సే. అందానికి అందం, టాలెంట్ కు టాలెంట్ ఉన్న నటి. ఇటీవల తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంటరైన అందమైన భామల్లో భాగ్యశ్రీ బోర్సే కూడా ఒకరు. గతేడాది రవితేజ హీరోగా వచ్చిన మిస్టర్ బచ్చన్ మూవీతో భాగ్యశ్రీ టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఎన్నో అంచనాలతో రిలీజైన ఈ సినిమా భాగ్యశ్రీ బోర్సే కి నిరాశనే మిగిల్చింది. మిస్టర్ బచ్చన్ సినిమా బాక్సాఫీస్ వద్ద కనీసం యావరేజ్ గా కూడా కాకుండా డిజాస్టర్ గా మిగిలింది. అయినప్పటికీ ఆ సినిమాలో భాగ్యశ్రీ నటనకు, డ్యాన్సులకు మంచి పేరే వచ్చింది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా కింగ్‌డమ్ మూవీలో నటించింది. కింగ్‌డమ్ సినిమా అయినా తనకు మంచి సక్సెస్ ను ఇస్తుందనుకుంటే ఆ సినిమా కూడా ఫ్లాపుగా నిలవడంతో మరోసారి అమ్మడి ఆశలపై నీళ్లు చల్లినట్టైంది. కెరీర్లో వరుసగా రెండు ఫ్లాపులు పడటంతో భాగ్యశ్రీ కెరీర్ ఆ తర్వాతి సినిమాల ఫలితాలపై ఆధారపడింది. కింగ్‌డమ్ తర్వాత అమ్మడు కాంత, ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాల్లో నటించగా, ఈ రెండు సినిమాలూ ఒకే నెలలో రెండు వారాల గ్యాప్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. వాటిలో తాజాగా కాంత సినిమా రిలీజైంది. కాంత సినిమా రిలీజ్ కు ముందు అమ్మడు ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకుంది. కానీ కాంతకు బాక్సాఫీస్ ట్రెండ్స్ కూడా ఏమంత ఆశాజనకంగా కనిపించడం లేదు. దీంతో ఇప్పుడు భాగ్యశ్రీ ఆశలన్నీ రామ్ పోతినేనితో చేసిన ఆంధ్రా కింగ్ తాలూకా పైనే ఉన్నాయి.