హిందువులను ఓటుబ్యాంకుగా మారుస్తా
బండి సంజయ్ కుమార్
ప్రతి పార్టీ హిందూ ధర్మం గురించి ఆలోచించేలా చేస్తా
ధర్మానికి ఆపదొస్తే రోడ్డుమీదికి వచ్చి కొట్లాడుతా
ఏపీలో పవన్ వల్లే మతం మారినోళ్లు బాధపడుతున్నరు
కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
కూకట్‌పల్లి/హైదరాబాద్, నవంబర్ 16 (ఈవార్తలు): ‘తెలంగాణలో ఉన్న 80 శాతం హిందూ జనాభాను ఏకతాటిపైకి తెచ్చి ఓటు బ్యాంకుగా మార్చడమే నా లక్ష్యం. ప్రతి రాజకీయ పార్టీ హిందూ ధర్మం గురించి ఆలోచించే రాజకీయ వాతావరణం తయారుచేస్తాను’ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో నిర్వహించిన కాపు సామాజిక వర్గం కార్తీక వన భోజనాల కార్యక్రమానికి బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఫస్ట్ మనం భారతీయులం. ఈ దేశంలో పుట్టడం మనకు గర్వకారణం. అందులో హిందువులుగా పుట్టడం పూర్వజన్మ సుకృతం. కులం కోసం పనిచేయడం తప్పులేదు. కానీ కేవలం కులం కోసం మాత్రమే పనిచేయడం తప్పు. సమాజంలో ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వారిని ఆదుకునేందుకు ప్రయత్నించే సంఘమే కుల సంఘం. నాకు కేంద్ర మంత్రి పదవి, ఎంపీ పదవి, రాజకీయాలు ముఖ్యం కాదు. నేను హిందువుగా పుట్టాను కాబట్టి, హిందూ ధర్మం కోసం పనిచేస్తాను. జూబ్లీహిల్స్‌లో బండి సంజయ్ ప్రచారం చేసిన ఓట్లు పడలేదు అని కొందరు అనుకుంటూ ఉండొచ్చు. కానీ నేను తిరిగింది రెండే రోజులు, మూడే మీటింగ్‌లు. నా ప్రచారానికి పర్మిషన్లు ఇవ్వలేదు. అడ్డుకునే ప్రయత్నం చేశారు. జూబ్లీహిల్స్‌లో ఓడిపోయామని నేను వెనక్కి తగ్గను. ఇంకా కసితోటి, పట్టుదలతో పనిచేస్తాను. తెలంగాణలో ఉన్న 80 శాతం హిందూ జనాభాను ఏకతాటిపైకి తెచ్చి ఓటు బ్యాంకుగా మార్చడమే నా లక్ష్యం. ప్రతి రాజకీయ పార్టీ హిందూ ధర్మం గురించి ఆలోచించే రాజకీయ వాతావరణం తయారుచేస్తాను. ఇది నేను మరిచిపోను. నేను వెనక్కి పోయేటోడిని కాను, భయపడే వ్యక్తిని కాదు. 12 శాతం ఓట్ల కోసం రాజకీయ పార్టీలు అన్ని వాళ్లకు జోకుతున్నారు. అదే తెలంగాణలో ప్రతి రాజకీయ పార్టీ హిందువుల కోసం మాత్రమే పనిచేసే విధంగా చేస్తాను. అయితే ఇక్కడ నేను ముస్లిం సమాజాన్ని, వారి మనోభావాలను కించపరచడం లేదు. అలాగే క్రైస్తవులు, ఇతర మతాల మనోభావాలను కించపరచడం లేదు. నేను నా ధర్మం గురించి గొప్పగా చెప్పుకుంటాను.. ధర్మానికి ఆపద వస్తే రోడు మీదకు వచ్చి కొట్లాడతాను. నేను ఎక్కడైనా ధర్మం గురించే మాట్లాడతాను. నా నుంచి వేరే ఆశించవద్దు. నేను ధర్మం కోసం మాత్రమే పనిచేస్తాను. మిమ్మల్ని నా దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తాను గానీ, నేను మీ దారిలోకి రాను. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో పవన్ కల్యాణ్ సనాతన ధర్మం కోసం పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని హిందూ సమాజం పవన్ కల్యాణ్ చెప్పే సనాతన ధర్మాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ఆంధ్రలో ఇతర మతాల్లోకి మారిన హిందువులు వారు పునరాలోచన చేసే పరిస్థితి వచ్చిందంటే.. దానికి పవన్ కల్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడటమే కారణం’ అని పేర్కొన్నారు.