వికెట్ విరగ్గొట్టిన సిరాజ్

వికెట్ విరగ్గొట్టిన సిరాజ్

Mohammad Siraj

పేసర్ మహమ్మద్ సిరాజ్

క్రికెట్‌లో వికెట్ విరగ్గొట్టం ప్రతీ బౌలర్ కల. ఆ కలను టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ నెరవేర్చుకున్నాడు. తన వేగవంతమైన బౌలింగ్‌తో క్లీన్ బౌల్డ్ చేయడంతో పాటు వికెట్‌ను మధ్యలోకి విరగ్గొట్టాడు. సౌతాఫ్రికాతో కోల్‌కతా వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో సిరాజ్ ఈ ఫీట్ సాధించాడు. సౌతాఫ్రికా టెయిలెండర్ సిమన్ హర్మర్(7)ను సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్ సందర్భంగా 54వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ మూడో బంతికి సిమన్ హర్మర్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. సిరాజ్ వేసిన బంతి వేగానికి ఆఫ్ స్టంప్ మధ్యలోకి విరిగి పడింది. అదే ఓవర్ ఆఖరి బంతికి స్టన్నింగ్ యార్కర్‌తో కేశవ్ మహరాజ్‌ను సిరాజ్ వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. దాంతో సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 153 పరుగులకు కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్‌లో రెండు ఓవర్లు మాత్రమే ఇచ్చిన సిరాజ్.. రెండు పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీసాడు. మూడో రోజు ఆట ఆరంభంలో సిరాజ్‌కు బౌలింగ్ ఇవ్వకుండా తాత్కలిక కెప్టెన్ రిషభ్ పంత్ ఘోర తప్పిదం చేశాడు. దాంతో సౌతాఫ్రికా 124 పరుగుల పోరాడే లక్ష్యాన్ని భారత్ ముందు ఉంచింది.

కెప్టెన్ టెంబా బవుమా(136 బంతుల్లో 4 ఫోర్లతో 55 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేయగా.. అతనికి కార్బిన్ బోష్(37 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 25) అండగా నిలిచాడు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా(4/50) నాలుగు వికెట్లు తీయగా.. కుల్దీప్ యాదవ్(2/30), మహమ్మద్ సిరాజ్(2/2) రెండేసి వికెట్లు పడగొట్టారు. జస్‌ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్‌కు చెరో వికెట్ దక్కింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 159 పరుగులకు ఆలౌటవ్వగా.. భారత్ 189 పరుగులు చేసి 30 పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.


పెళ్లిపై మరోసారి త్రిష హాట్ కామెంట్స్
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్